Viral: చిన్నోడు కాదు.. చిచ్చరపిడుగు.. కోబ్రాను కొరికి చంపిన ఏడాది బుడ్డోడు
బీహార్‌లో ఓ ఏడాది పసిబిడ్డ నాగుపామును బొమ్మగా భావించి కొరికి చంపిన ఘటన సంచలనంగా మారింది. పాము చేతిని చుట్టుకున్న సమయంలో చిన్నారి కసకసా కొరకడంతో.. అది అక్కడికక్కడే మృతి చెందింది. అంత అగ్రెసీవ్‌గా ఉండే నాగుపామును.. బాలుడు కొరికి చంపడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బీహార్ రాష్ట్రంలోని బెట్టియాహ్ గ్రామంలో ఓ ఏడాది వయస్సున్న బుడ్డోడు నాగుపామును కొరికి చంపిన విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గోవిందా అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా ఓ కోబ్రా పాము అతడి చేతిపై చుట్టుకుంది. ఆ సమయంలో బొమ్మ అనుకుని గోవిందా ఆ పామును బలంగా కొరికేశాడు. చిన్నారి కాటుతో ఆ విషపూరిత పాము అక్కడికక్కడే మృతి చెందింది.
తర్వాత చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (GMCH), బెట్టియాహ్‌కు తరలించారు. వైద్యులు గోవిందా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. వైద్య పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు.
చిన్నారి తల్లి కట్టెల కోసం ఇంటి పక్కనే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. అప్పుడు ఆమెను పిలిచి సమాచారం అందించామని గోవిందా బామ్మ మతేశ్వరి దేవి చెప్పారు. ఈ ఘటన గ్రామంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత చిన్నోడు నాగుపామును ఎలా చంపగలిగాడో అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
