YS Sharmila Praja Prasthanam Padayatra: తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు. బుధవారం నుంచి చేవెళ్లలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మంగళవారం వెల్లడించారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్సార్ సెంటిమెంట్‌గా భావించే చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రం అంతటా పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే ద్యేయంగా పనిచేస్తానని ఆమె స్పష్టంచేశారు. వైయస్ సంక్షేమ పాలన అంటే రైతులకు విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫి లాంటివి అమలు చేయడమని తెలిపారు. మహిళలు సొంతకాళ్లపై నిలబడి లక్షాధికారులు కావడం తమ పార్టీ లక్ష్యమని షర్మిల తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమని.. ప్రెయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఇవన్నీ వైయస్ సంక్షేమ పథకాలని ఆమె తెలిపారు. అలాంటి పాలన ఇప్పుడు తెలంగాణలో లేదని.. వైఎస్ పాలన కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తామని షర్మిల తెలిపారు. ప్రజలందరూ ఈ పాదయాత్రకు తోడ్పాటునందించాలని వైఎస్ షర్మిల కోరారు.
కాగా.. ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర రోజూ 10 నుంచి 15 కిలోమీటర్లు సాగనుంది. ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఎక్కువగా గ్రామాల మీద నుంచే యాత్ర కొనసాగేలా ప్రణాళికలు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాత్ర సాగనుంది. తొలిరోజు చేవెళ్లలో సుమారు లక్ష మంది పాల్గొనేలా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణకు పార్టీ ప్రతినిధులు ప్రణాళికలు రూపొందించారు.
Also Read: