Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు వ్యక్తులు జనాలను మోసం చేసేందుకు ఎప్పికప్పుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని నమ్మి తమ కష్టా జీతాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదారాద్‌ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రియల్‌ ఎస్టేట్‌, చిట్‌ఫండ్స్‌ పేరుతో ఓ మహిళ ఏకంగా జనాల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు కిలేడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ
Hyderabad Fraud

Edited By:

Updated on: Apr 29, 2026 | 10:21 PM

రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన ఓ మహిళను వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హయత్ నగర్ నియోజకవర్గంలోని కమలా నగర్‌లో నివాసం ఉంటున్న బద్దం జ్యోతి రెడ్డి, గత 9 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతోంది. తొలుత తన పరిచయస్తుల వద్ద చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు సేకరించి, వారికి సకాలంలో లాభాలు చెల్లించడం ద్వారా బలమైన విశ్వాసాన్ని సంపాదించుకుంది.

ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, 2020 నుండి భారీ ఎత్తున చిట్ ఫండ్‌లు నిర్వహించడం ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామని, చిట్టీల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 20 మంది బాధితుల నుండి దాదాపు రూ.6.5 కోట్లు వసూలు చేసింది. అయితే చాలా కాలంగా బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతుండగా, నిందితురాలు కాలయాపన చేస్తూ తప్పించుకు తిరగడం మొదలు పెట్టింది.

దీంతో అనుమానం వచ్చిన బాధితులు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, జ్యోతి రెడ్డి చేసిన మోసాలు బయటపడ్డాయి. విచారణలో నిందితురాలు మరికొందరి నుండి కూడా భారీగా డబ్బులు వసూలు చేసినట్లు అంగీకరించింది. దీంతో జ్యోతి రెడ్డి పై BNS చట్టంలోని సెక్షన్‌లు 318(4), 316(2), r/w 3(5)తో పాటు Chit Funds Act, 1982 సెక్షన్ 76 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు పంపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us