Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు కురిశాయి. రానున్న రెండు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
Rain Alert in Telangana: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు కురిశాయి. రానున్న మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధవారం అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్‌ల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని ప్రకటించింది అమరావతి వాతావరణ శాఖ.
మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని దోమలపల్లిలో 4.9 సెంటిమీటర్ల వర్షపాతం కురిసిందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇక, నల్గొండలో 4.8, సిద్దిపేట జిల్లా కోహెడలో 4.3, ఖమ్మం జిల్లాలో రావినూతల 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో చిట్కుల్ 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇక పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని తెలిపారు వాతావరణశాఖాధికారులు. దక్షిణ గంగేటిక్ పశ్చిమ బంగాల్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉపరితల ద్రోణి, అల్పపీడనం నుంచి తెలంగాణ వరకు కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో అన్ని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడుతోంది. అలాగే నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతతోంది. వర్షాకాలం ముగింపు దశలోనూ వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులు నిండుగా కనిపిస్తున్నాయి.
Covaxin for Kids: థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవాగ్జిన్ టీకా..!