ఒకవైపు వడగాల్పులు దంచి కొడుతున్నాయి. వేడి సెగలతో చంపేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఐదుగురిని చంపేశాయి. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటాయో చెప్పలేం. మరోవైపు.. రుతుపవనాల జర్నీ మొదలైంది. ఇప్పటికే దక్షిణ అండమాన్ వరకు వచ్చేశాయి. కొన్నిచోట్ల వానలు కూడా కురుస్తున్నాయి. ఇక ఏపీలో మాత్రం ఎండలు మాడు పగులగొడుతున్నాయి. రోహిణికార్తెలో రెండు రకాల వాతావరణాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
రుతుపవనాలు జర్నీ స్టార్ట్ చేశాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు బులెటిన్ విడుదల చేసింది వాతావరణ శాఖ. జూన్ 4 నుంచి దక్షిణ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తాయట. జూన్ 4 న దేవభూమి కేరళను తాకి.. అక్కడి నుంచి మెల్లగా మన దగ్గరికి రావడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దీని ప్రభావంతో తెలంగాణలో మూడు నాలుగు రోజుల్లో ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు ఏపీలోని 23 మండలాల్లో వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిరోజులుగా భానుడి దాటికి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..