AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Forecast: అలర్ట్.. బాబోయ్ ఇదేం చలిరా అయ్యా.. మరో రెండు రోజులు చుక్కలేనట.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

చలి చంపేస్తోంది.. ఎన్నడూ లేనంతగా గజగజ వణికిస్తోంది.. ఇప్పటికే కాన్పూర్‌లో వందమంది చనిపోయారు. ఇంకా చాలామంది చలి దెబ్బకు ఏమవుతారో చెప్పలేని పరిస్థితి..

Weather Forecast: అలర్ట్.. బాబోయ్ ఇదేం చలిరా అయ్యా.. మరో రెండు రోజులు చుక్కలేనట.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Weather Forecast
Shiva Prajapati
|

Updated on: Jan 10, 2023 | 7:30 AM

Share

చలి చంపేస్తోంది.. ఎన్నడూ లేనంతగా గజగజ వణికిస్తోంది.. ఇప్పటికే కాన్పూర్‌లో వందమంది చనిపోయారు. ఇంకా చాలామంది చలి దెబ్బకు ఏమవుతారో చెప్పలేని పరిస్థితి.. అటు ఢిల్లీని పొగమంచు కప్పేసింది.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పులి పంజా విసురుతోంది. ఇటు ఆదిలాబాద్, అటు అరకు విశాఖ ప్రాంతాల్లో చలి తీవ్రత దారుణంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా చలి గజగజలాడిస్తోంది.

ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా చలి పులి పంజా..

ఉదయం పది గంటలవుతున్నా.. బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. తెలంగాణ చలికి గజగజలాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తోంది తెలంగాణ వాతావరణ శాఖ. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదు కాగా.. మెదక్, సిద్ధిపేట్ జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డయ్యాయి.

ఉత్తరాదిలో చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులతో వాయువ్య, మధ్య, తూర్పు భారతం.. మంచు దుప్పట్లు కమ్ముకుంటోంది. ఢిల్లీలోని సఫ్జర్ జంగ్ ప్రాంతంలో 1- 2 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. గతంలో ఎన్నడూ చూడనంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాబట్టి.. జాగ్రత్త గా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే రెండ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉత్తరాన వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జనవరి 11 వరకూ రాష్ట్రంలో చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని అంటోంది ఐఎండీ హైదరాబాద్. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్- ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డు కావడమే ఇందుకు కారణం.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిన్న ఆదిలాబాద్ లో ఆరు, మెదకర్ లో 8, హన్మకొండ 9. 9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రామగుండం 10. 6, హైదరాబాద్ 11. 3, నిజామాబాద్ 12. 5, దుండిగల్, ఖమ్మం 12. 6, హకీంపేట్ 13. 8, భద్రాచలం 14, మహబూబ్ నగర్ 14. 1 నల్గొండ 14. 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఐదారు డిగ్రీల తక్కువ కావడం విశేషం. రానున్న రెండ్రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశమున్నట్టు చెబుతోంది హైదరాబాద్ వాతావరశాఖ.

ఇక ఏపీలో అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత రెండ్రోజులుగా ఇక్కడ మంచు గడ్డ కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాహనాలపై గాజులా మంచు పేరుకుపోయి కనిపించింది. జీమాడుగులలో ఆరుబయట పార్క్ చేసిన వాహనాలపై గడ్డకట్టిన మంచు దృశ్యాలు వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి.

ఇది గతంలో తామెన్నడూ చూడని మంచు దృశ్యమని అంటున్నారు స్థానికులు. పంటపొలాల్లో మంచు గడ్డ కట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలను చూస్తే చింతపల్లిలో అత్యల్పంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మినుములూరు 8, పాడేరు, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఇవీ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. గత సీజన్లో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..