Warangal: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై సీఐ అత్యాచారయత్నం..
వరంగల్ జిల్లాలో ఓ సీఐ తీరు వివాదాస్పదమవుతోంది. ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఆ బాలికకు మంచి చెప్పే క్రమంలోనే హెచ్చరించానని సీఐ అంటుండడం ఆసక్తిగా మారుతోంది.
వరంగల్ జిల్లాలో ఓ బాలికపై సీఐ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. వరంగల్ వడ్డేపల్లిలోని పీజీఆర్ లేక్‌వ్యూ టవర్స్‌లో ఉంటున్న రవికుమార్.. కాజీపేట సీఐగా పనిచేస్తున్నారు. సీఐ ఉంటున్న ఫ్లోర్‌లోనే ఓ బాలిక కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో.. అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న ఆ బాలికను చూసిన సీఐ రవికుమార్.. అతనితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించి.. అతన్ని పంపించి ఇంట్లోకి రావాలని బెదిరించారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భయంతో బాలిక సీఐ ఇంట్లోకి వెళ్ళగా.. బెడ్‌రూంలోకి లాక్కెళ్లినట్లు చెప్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారయత్నం చేయడంతో సీఐ నుంచి తప్పించుకున్న బాలిక.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
దాంతో.. కాజీపేట పోలీస్ స్టేషనల్ ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ స్వీకరించిన కాజీపేట పోలీసులు.. సీఐ రవికుమార్‌పై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. బాలిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సీఐ రవికుమార్. బాలిక దారి తప్పినట్లు అనిపించడంతోనే హెచ్చరించేందుకు ప్రయత్నించినట్లు చెప్తున్నారు. అపార్ట్‌మెంట్ కారిడార్‌లో ఓ యువకుడితో బాలిక మాట్లాడుతుండగా మందలించానన్నారు.
అటు.. సీఐ రవికుమార్ ఫ్యామిలీ సైతం బాలిక ఆరోపణలపై మండిపడుతున్నారు. తమ కూతురు.. బాలిక ఇద్దరూ క్లాస్‌మేట్స్ కావడంతో ఆ చనువుతో తమ భర్త బాలికను మందలించారని.. దీనిలో వేరే ఉద్దేశ్యం లేదంటున్నారు సీఐ సతీమణి. ఇక.. ఘటనపై కేసు నమోదు చేసినప్పటికీ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తిస్థాయి విచారణ చేసేందుకు కాజీపేట పోలీసులు రంగంలోకి దిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..