తెలుగు రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు.. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వానల తీవ్రతకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు, రైల్వే ట్రాకులు సైతం తెగిపోతున్నాయి. పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేసి అధికారులు, పోలీస్ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేశారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారి పైకి భారీగా గోదావరి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు అధికారులు. మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవసరం, ఆపద ఎదురైనా వెంటనే అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..