ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. ఆ తర్వాత తండాలో మారిన సీన్.. పోలీసుల కంట్లో కారం చల్లి..
హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటోన్న స్రవంతి.. భర్త ప్రవీణ్ వేధింపులు భరించలేక.. రెండ్రోజులక్రితం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. స్రవంతి సూసైడ్‌తో బంధువులు రగిలిపోయారు. భర్త ప్రవీణ్ సొంతూరైన వరంగల్ జిల్లా బోడమాణిక్యతండాలో అతని ఇంటికి నిప్పుపెట్టారు. ఇక, అర్థరాత్రి అంబులెన్స్‌లో ముగ్గురి మృతదేహాలను బోడమాణిక్యతండాకి తీసుకురావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో భర్త వేధింపులు భరించలేక కన్న కొడుకులను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి స్రవంతి అంతిమ సంస్కారాలు వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసాయి. మృతురాలి కుటుంబ సభ్యులు భర్త ఇంటిముందే గొయ్యితవ్వి ఆ పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీసుల కంట్లో కారం చల్లి రణరంగం సృష్టించారు.
అర్దరాత్రి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యతండాలో ఉద్రిక్తత నెలకొంది.. కూకట్‌పల్లిలో మంగళవారం బోడ స్రవంతి తన ఇద్దరు పిల్లలైన కార్తీ, కౌశి లకు ఉరివేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో వారి స్వగ్రామంలో రెండు రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రవీణ్ ఇంటికి మృతురాలి కుటుంబ సభ్యులు నిప్పు పెట్టారు.
అయితే హైదరాబాద్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను బంధువులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని బోడమాణిక్యంతండాలోని భర్త ప్రవీణ్ ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే ప్రవీణ్ ఇంటి ఎదుట మృతదేహాలను పూడ్చడానికి మృతురాలి కుటుంబీకులు గుంతలుతీశారు. బుధవారం రాత్రి అంబులెన్స్ లో తల్లి, కుమారుల మృతదేహాలు గ్రామ శివారులోని నక్కల్ గుట్ట తండాకు చేరుకోగా, పోలీసులు అడ్డుకున్నారు.
మృతదేహాలను ప్రవీణ్ ఇంటికి తీసుకువెళ్లకుండా అంబులెన్స్ ను ఆపారు. మృతదేహాలను ఊరిలోకి తీసుకెళ్లకుండా శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపాలని పోలీసులు ఆదేశించారు. దీంతో స్రవంతి కుటుంబసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే తీసిన రెండు గుంతల్లో పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్రవంతి కుటుంబసభ్యులు, బందువులు ఆందోళనకు దిగారు.
గ్రామ పెద్దల సహకారంతో రాజీ చేసుకోవాలని పోలీసులు నచ్చచెప్పినా వారు వినలేదు. మృతదేహాలను పూడ్చేందుకు పోలీసులు అడ్డుగా ఉండటంతో, బాధిత కుటుంబ సభ్యులు వారి కళ్లల్లో కారం చల్లారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. కళ్లల్లో మంటలతో పోలీసులు అక్కడి నుంచి తప్పుకోవడంతో స్రవంతి బంధువులు ప్రవీణ్ ఇంటి ముందే ఇద్దరు పిల్లల మృతదేహాలను ఖననం చేశారు.
అనంతరం స్రవంతి మృతదేహాన్ని ప్రవీణ్ ఇంటి సమీపంలోని చేనులో దహనం చేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ స్రవంతి కుటుంబసభ్యుల బంధువుల ఆగ్రహావేశాలను అదుపు చేయలేకపోయారు.
అదే గ్రామంలో ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్న యువతి ఇల్లు కూడా ఉండటంతో, అక్కడ దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య జరిగిన మంగళవారం రోజు ప్రవీణ్ తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్లిపోగా, ఇంటిని స్రవంతి బంధువులు నిప్పుపెట్టి దహనం చేశారు. రెండు రోజులు వరుసగా జరిగిన ఘటనలతో బోడ మాణిక్యంతండా అట్టుడికింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
