తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జెట్ స్పీట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. మరికొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని పలువురు మంత్రులు, నేతలు ప్రకటిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఓ వైపు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మండిపడుతూనే తమకేం నష్టం లేదని.. పేర్కొంటోంది.. బీజేపీ మాత్రం ఈ అంశంపై మరోలా రియాక్ట్ అయి.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గతే పడుతుంది అంటూ విమర్శలు చేస్తోంది.. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి BRS ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పనైపోయిందనే వాళ్లు.. ఇప్పుడు తమ దగ్గర ఎంతమంది మిగలారో లెక్కపెట్టుకుంటున్నారని పరోక్షంగా బీఆర్ఎస్‌పై సెటైర్లు వేశారు. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అయితే పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్‌కు నష్టమేమీ లేదన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సమస్యలను పరిష్కరించకుండా.. సీఎం రేవంత్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతుంటే.. తెలంగాణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ రేవంత్‌రెడ్డి ఆనందిస్తున్నారని.. కానీ అది మంచి పద్దతి కాదని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇలాగే వ్యవహరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందన్నారు.
మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ హరీష్‌రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషి అని అన్నారు. హరీష్‌రావు BJPలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసే రావాలని స్పష్టం చేశారు.
మొత్తానికి నేతల కామెంట్స్ ఎలా ఉన్నా.. తెలంగాణలో మరికొన్ని రోజులు ఈ జంపింగ్ పాలిటిక్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ గూటికి చేరతారో అని గులాబీ పార్టీలో గుబులు మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..