పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ మావోయిస్టు పార్టీ కరపత్రాలు, వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దులో కరపాత్రలతో ఖాకీలకు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వై-జంక్షన్ వద్ద ఈ వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ కార్యదర్శి పేరుతో కరపత్రాలు, వాల్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రధాన రహదారిపై అక్కడక్కడ వాల్ పోస్టర్లు వదిలి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ఈ వాల్ పోస్టర్ల ద్వారా మావోయిస్టులు ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాల్ పోస్టర్లను తొలగించిన పోలీసులు మావోయిస్టుల కదలికలపై నిఘా ముమ్మరం చేశారు. ఏజెన్సీలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా ప్రత్యేకచర్యలు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. ఇలాంటి తరుణంలో ఈ పోస్టర్లు, కరపత్రాల అంశం ఓటర్లను కలవరపెడుతోంది. పోలింగ్ సజావుగా జరుగుతుందా లేక ఏవైనా హింసాత్మక ఘటనలు జరుగుతాయా అన్న అనుమానం రేకెత్తుతోంది. అయితే వీటిని ఎన్నికల కమిషన్ తిప్పికొడుతోంది. ఎలాంటి అవాఛనీయమైన ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలతో గస్తీ కాస్తున్నామంటున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…