భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వెండి వాకిలి నుంచి భక్తుల దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఇందులో ఉచిత దర్శన మార్గంలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. మూలవిరాట్‌కు సమీపంలో అంత రాలయానికి పన్నెండేళ్ల కిందట రూ.40లక్షలతో పసిడి తాపడంతో బంగారు వాకిలి అమర్చారు. ఉచిత దర్శన ద్వారానికి, అంతరాలయానికి మధ్యలో గల ముఖ మండపానికి ఇప్పుడు 100కిలోల రజత రేకులతో వాకిలిని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్థపతి దండపాణి సార్థ్యంలో దీన్ని తయారు చేశారు. వెండి వాకిలిలో దేవతామూర్తుల దర్శనం నేత్రపర్వంగా ఉంది. తోరణంలో దశావతారాలు, ఆళ్వార్లు, హంస తదితర రూపాలు దర్శనమిస్తున్నాయి. చూడచక్కని డిజైన్లతో వెండి ద్వారం భక్తులను ముగ్ధులను చేస్తోంది. ఇప్పుడు మూడు లోహలతో కూడిన ద్వారాల్లో స్వామివారు చక్కగా దర్శనమిస్తున్నారు.
ప్రతి శుక్రవారం రోజున మూల విరాట్‌కు స్వర్ణ కవచాలా అలంకరణ చేయనున్నారు. అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకుంటారు. ఇప్పుడు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..