Kishan Reddy: పేద విద్యార్థులకు బాసటగా కిషన్ రెడ్డి.. వారందరి ఎగ్జామ్ ఫీజు తాను కడతానని ప్రకటన
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల SSC బోర్డు పరీక్ష ఫీజులను తన ఎంపీ జీతం నుంచి భరిస్తానని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ప్రకటించారు. ఏ స్టూడెంట్.. విద్యా ప్రయాణం ఆర్థిక అడ్డంకుల వలన ఆగిపోకూడదు.. అంటూ అంత్యోదయ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

పేద విద్యార్థులకు అండగా నిలబడాలి.. ఆర్థిక ఇబ్బందులు వారి చదువులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో.. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరి తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్ష ఫీజులను తన ఎంపీ జీతం నుంచి భరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ హరికచందన దాసరి, జిల్లా విద్యా అధికారికి లేఖ రాశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, పాఠశాల వారీగా 10వ తరగతి విద్యార్థుల వివరాలు, మొత్తం జమ చేయవలసిన మొత్తం పంపాలని అందులో కోరారు.
“ఏ విద్యార్థి భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోకూడదు. అంత్యోదయ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాబోయే పరీక్షల్లో విద్యార్థులు అందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘X’ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పేద విద్యార్థుల కుటుంబాలకు కొంత ఊరట కలిగించేలా ఉందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
No child’s journey toward education and excellence should be hindered by financial barriers.
Therefore, in the spirit of Antyodaya, I will be covering the full Telangana SSC Board examination fees of all 10th class students studying in government schools across the Secunderabad… pic.twitter.com/rNc8gp7STf
— G Kishan Reddy (@kishanreddybjp) November 13, 2025
