తాము చెల్లిస్తున్న పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి. బీఆర్ఎస్ నేతల కామెంట్. మీరు ప్రపంచం ముందు దేశ స్థాయిని దిగజార్చారు. బీజేపీ నేతల కౌంటర్. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇంతకీ కేటీఆర్ సవాల్‌ను కిషన్ రెడ్డి స్వీకరించినట్లేనా? తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ మూమెంట్‌పై ఓ లుక్కేసుకుందాం..
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రానికి మీరేం చేశారంటే మీరేం చేశారంటూ నేతలు సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజీనామా లేఖలు జేబులో పెట్టుకొని రండి అంటూ సవాల్ విసిరారు. కేంద్రంపై అసత్య ప్రచారం చేయొద్దన్న కిషన్‌రెడ్డి.. రాజకీయాలు చేయండి కాని దేశం గౌరవం తగ్గించవద్దన్నారు. మమ్మల్ని విమర్శించండి.. జవాబు చెప్తాం, అంతే కాని ప్రపంచ స్థాయిలో దేశ గౌరవాన్ని తగ్గించవద్దంటూ టీఆర్ఎస్ నేతలకు సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పాకిస్తాన్, శ్రీలంకతో పోలుస్తారా? ఇదేనా మీ పద్ధతి అంటూ మండిపడ్డారు.
కులాలు, మతాల వారిగా ప్రజలను విడదీస్తే.. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌లా మాదిరి దేశం రగిలిపోతుందన్నది మహబూబాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల సారాంశం. అదే సమయంలో తెలంగాణకు మీరిచ్చిన నిధులు ఎన్ని అంటే? మీరేం చేశారంటూ ఈ నెల 6న నల్గొండ పర్యటనలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై సవాలు విసిరిన కేటీఆర్.. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ ప్రకటించారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తండ్రిని అడ్డుపెట్టుకుని నేను మంత్రిని కాలేదన్న కిషన్ రెడ్డి..కిందిస్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగానంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ రాజీనామా పత్రం తీసుకొని వస్తే చర్చకు సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్, కేసీఆర్ కంటే దిగజారి మాట్లాడటం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి. మరి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ తర్వాత గులాబీ దళం నుంచి ఎలాంటి కౌంటర్ రాబోతుంది.. దీనిపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..