Telangana: ఆప్తమిత్రుడి మరణంతో కలత చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య..!
స్నేహితుని మృతిని జీర్ణించుకోలేక, నీ వెంటే నేను అంటూ తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన అందరిని తీవ్రంగా కలచివేసింది. స్నేహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెబుతోందీ ఘటన. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
![Telangana: ఆప్తమిత్రుడి మరణంతో కలత చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/11/kota-student-suicides.jpg?w=1280)
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా..! అని ఓ సినీ గేయ రచయిత రాసిన పాట అక్షర సత్యం అని నిరూపించారు ఆ విద్యార్థులు. మరణంలోనూ స్నేహ బంధాన్ని వీడలేకపోయారు. కానరాని లోకాలకు తరలి వెళ్లిన తన స్నేహితుని మృతిని జీర్ణించుకోలేక, నీ వెంటే నేను అంటూ తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన అందరిని తీవ్రంగా కలచివేసింది. స్నేహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెబుతోందీ ఘటన.
గోదావరిఖని మేదర్ బస్తీకి చెందిన సులువ శ్రీనాదీశ్వర్, NTPC లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అతనితో కలిసి చదువుకుంటున్న మిత్రుడు రోహక్ నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణ సమానమైన స్నేహితుడు కానరాని లోకాలకు తరలివెళ్లడని జీర్ణించుకోలేని శ్రీనాదీశ్వర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గత ఆదివారం(జనవరి 26) జరిగిన రోహక్ నెల కర్మకు హాజరైన శ్రీనాదీశ్వర్ తన స్నేహితుని జ్ఞాపకాలను తలుచుకుంటూ లోలోపల కూలిపోయాడు.
తన స్నేహితుడు లేని లోకం తనకెందుకు అని నిర్ణయించుకున్నాడో.. ఏమో.. శ్రీనాదీశ్వర్ కటోర నిర్ణయం తీసుకున్నాడు. స్నేహితుని నెల కర్మకు హాజరై వచ్చిన రోజునే అర్ధరాత్రి దాటాక జనవరి 27న ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక శ్రీనాదీశ్వర్ కూడా తనువు చాలించడం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. క్షణికావేశంలో ఇద్దరు విద్యార్థులు చేసిన పనికి రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.