Telangana: తొలి కేబినెట్‌లో స్థానం దక్కిన ఆ ఇద్దరు మహిళలు ఓరుగల్లు బిడ్డలే..

ముఖ్యమంత్రితో సహా 12 మంది మత్రులతో తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ కొలువు దీరింది. మంత్రి వర్గంలో ఇద్దరు మాత్రమే మహిళలు మినహా మిగిలిన వారంతా పురుషులే. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఇద్దరు మహిళలు సీతక్క, కొండా సురేఖ ఓరుగల్లుకు చెందిన వారే. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ఈసారి ముగ్గురు మహిళలు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు..

Telangana: తొలి కేబినెట్‌లో స్థానం దక్కిన ఆ ఇద్దరు మహిళలు ఓరుగల్లు బిడ్డలే..
Congress

Edited By:

Updated on: Dec 08, 2023 | 8:48 PM

ముఖ్యమంత్రితో సహా 12 మంది మత్రులతో తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ కొలువు దీరింది. మంత్రి వర్గంలో ఇద్దరు మాత్రమే మహిళలు మినహా మిగిలిన వారంతా పురుషులే. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఇద్దరు మహిళలు సీతక్క, కొండా సురేఖ ఓరుగల్లుకు చెందిన వారే. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ఈసారి ముగ్గురు మహిళలు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారిలో ఇద్దరు సీనియర్ మహిళా నేతలకు మంత్రి పదవి దక్కింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర.. ములుగు నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు గెలిచిన సీతక్క రాజకీయ జీవితంలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. గతంలో నక్సలైట్ గా పనిచేసి జనజీవన స్రవంతిలో అడుగుపెట్టిన సీతక్క ఆ తర్వాత ప్రజా నాయకురాలుగా ప్రజల గొంతుకైంది. జనం సమస్యలే తన సమస్యలుగా నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ జనం గుండెల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో ములుగు నుండి పోటీ చేసి మొదటిసారి ఓటమి పాలయ్యారు.

మొదట ఓటమి పాలైన ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. 2009లో మరోసారి పోటీ చేసి గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2018లో మరోసారి గెలుపొందిన సీతక్క ప్రతిపక్ష MLAగా అసెంబ్లీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఇదే ములుగు నియోజక వర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందిన సీతక్క కు రేవంత్ రెడ్డి కేబినెట్లో స్థానం దక్కింది.

ఇక కొండా సురేఖ విషయానికి వస్తే 2004 సాధారణ ఎన్నికల్లో శాయంపేట MLAగా గెలుపొందారు.ఈ నియోజక వర్గం రూపాంతరం చెందిన తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ కొండా సురేఖ కు మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత వైఎస్‌ మరణానంతరం తన మంత్రి పదవి కి రాజీనామా చేశారు.

రాజకీయ పునరేకీకణలో భాగంగా బీఆర్‌ఎస్‌లో చేరిన కొండా సురేఖ 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుండి గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ టికెట్ నిరాకరించడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పరకాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2023 సాధారణ ఎన్నికల్లో మళ్ళీ వరంగల్ తూర్పు నుండి పోటీ చేసి గెలుపొందిన కొండా సురేఖ. నాల్గవ సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సురేఖ కు ఎట్టకేలకు మంత్రి పదవి వరించింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవులు పొందిన ఇద్దరు మహిళలు ఒకే జిల్లా కు చెందిన వారు కావడంతో ఈ ఇద్దరు మహిళా మంత్రులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

అయితే కొండా సురేఖకు గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. సీతక్క మాత్రం కేబినెట్ మంత్రి హోదాలో బాధ్యతలు చేపట్టడం ఇదే ప్రధమం. కానీ రాజకీయ చతురత కలిగిన సీతక్కకు న్యాయవాదిగా కూడా ఆమెకు అనుభవం ఉంది. చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగిన సీతక్క ఖచ్చితంగా మంత్రిగా తన సమర్థత ప్రదర్శిస్తానని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి