Paleru: వచ్చేసిన తుమ్మల.. నెక్ట్స్ షర్మిల..! ఇద్దరికీ కావాల్సింది పాలేరు టికెట్టే?.. మరి
ఇంతకీ పాలేరు టికెట్ ఎవరికి? కాంగ్రెస్‌లో చేరారు కదా అని పాలేరు టికెట్‌ను తుమ్మలకు కన్ఫామ్ చేయలేదు. పార్టీని ఇంకా విలీనం చేయలేదు కాబట్టి షర్మిలకు కూడా ఫిక్స్ చేయలేదు. మరి ఆ సీటు ఎవరికి? బిగ్ స్టోరీ నడుస్తోంది పాలేరు టికెట్ వెనక. ఇదొక్కటే కాదు.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లకు కూడా టికెట్‌పై క్లారిటీ లేదు. మరి కొత్తగా చేరుతున్న వాళ్లందరికీ ఎలా న్యాయం చేయబోతోంది, ఎలా మేనేజ్ చేయబోతోంది?
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు, పాలేరు నుంచి పోటీకి దిగుతారు..! ఎన్నాళ్లగానో నానుతున్న టాపిక్కే ఇది. కాకపోతే.. కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక, పార్టీ విలీనంతో షర్మిల రాకతో కొత్త ఈక్వేషన్స్, కొత్త వర్షన్స్ తెరమీదకు వస్తున్నాయి. ఈ ఇద్దరికీ కావాల్సింది పాలేరు టికెట్టే. అందులో నో డౌట్. మరి ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ లీడర్. మంత్రిగా జిల్లా రాజకీయాలను ఏలిన నాయకుడు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ అనుచరగణం, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన చరిత్ర అన్నీ ఉన్నాయి. పైగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అండదండలు పుష్కలం. తుమ్మల రాకను కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించిన వాళ్లు ఒక్కరు కూడా లేరు. ఖమ్మం జిల్లా నేతలు రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇలా అందరూ సాదరంగా ఆహ్వానించారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరారంటే కచ్చితంగా పాలేరు టికెట్ హామీతోనే అయి ఉంటుంది. తనను ఓడించిన కందాల ఉపేందర్‌రెడ్డిపై ఈసారి గెలిచి తీరాలన్న కసితో ఉన్నారాయన. కాని, అట్నుంచి వైఎస్ షర్మిల వస్తున్నారు. అది కూడా సాదాసీదా రికమెండేషన్‌తో కాదు. తెలంగాణలో ఎవరూ అడ్డు చెప్పలేని గట్టి మద్దతుతో. ఈ పోటీలో షర్మిలదే పైచేయి అయితే మాత్రం.. తుమ్మల రాజీ పడాల్సిందే. అసలు ఈపాటికే డిస్కషన్స్ జరిగి ఉంటాయి కూడా. షర్మిల వస్తున్నారు కాబట్టి.. వేరే నియోజకవర్గం తీసుకోండని చెప్పే ఉంటారు. అందుకే, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే వార్త చాలా బలంగా వినిపిస్తోంది.
తుమ్మలకు ఖమ్మం అయినా ఫర్వాలేదు. ఎందుకంటే గతంలో పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది. పైగా కమ్మ సామాజికవర్గ ఓట్లు కూడా ఉన్నాయి. కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ కూడా కలిసిరావొచ్చు. కాని, ప్రశ్న ఏంటంటే.. పాలేరు టికెట్‌పై తుమ్మల ఎందుకు రాజీపడాలి? సరే.. ఒకవేళ తుమ్మల సర్దుకుపోయినా రేవంత్‌రెడ్డి ఎలా రాజీ పడతారు? షర్మిలకు చెక్ పెట్టేందుకు, పాలేరు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డి గట్టి ప్రయత్నాలే చేశారని చెప్పుకుంటుంటారు. కాని, షర్మిల గట్టి రికమెండేషన్‌తో వస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి గానీ, రాష్ట్ర నాయకులకు గానీ వైఎస్ షర్మిలను ఆపేంత శక్తి లేదు. షర్మిల ఉపయోగించిన ఛానల్ అలాంటిది మరి. హైదరాబాద్‌ను బైపాస్ చేస్తూ కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ద్వారా నేరుగా ఢిల్లీ అధిష్టాన్ని కలిశారు. డీకే మాటను కాంగ్రెస్ హైకమాండ్ కూడా కాదనలేదు. ఎందుకంటే.. ఒక్క మాటతో ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారు కాబట్టి. అటు డీకే, ఇటు పార్టీ హైకమాండ్.. ఈ ఇద్దరి మాటను రేవంత్ రెడ్డి కాదనలేరు. సో, షర్మిలకు పాలేరు టికెట్ ఫిక్స్ అయినట్టేనని అనుకోవాలి.
సరే.. పాలేరులో షర్మిల అడుగుపెట్టారు అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఇడమగలరా? పాలేరు టికెట్ ఇచ్చినా.. షర్మిల పనిచేయాల్సింది రాష్ట్ర నాయకత్వంతోనే. అంటే రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాని, షర్మిల తెలంగాణ ఎంట్రీని రేవంత్ రెడ్డి డైరెక్టుగానే వ్యతిరేకించారు. తోడుగా వి.హనుమంతరావు లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా కీలక నేత రేణుకా చౌదరి మొదట్లో షర్మిలను స్వాగతించినా.. పాలేరు టికెట్ అడగడం మాత్రం నచ్చడం లేదు. దీంతో ఇటు ఖమ్మం జిల్లాలో తుమ్మల, రేణుకా చౌదరితో, రాష్ట్రస్థాయిలో రేవంత్‌రెడ్డి వర్గంతోనూ ఇమడగలరా అనేది సందేహం. పైగా ఒకసారి విలీనం జరిగిన తరువాత.. ఇక అధిష్టానం జోక్యం పెద్దగా ఉండకపోవచ్చు. అడిగినట్టుగా పాలేరు ఇచ్చేస్తున్నాం కాబట్టి, కొంత మీరే సర్దుకుపోవాలని చెప్పొచ్చు. అలాంటప్పుడు రాష్ట్ర నాయకత్వంతో గిల్లికజ్జాలను తట్టుగోలరా? షర్మిలకు కాంగ్రెస్‌తో అంత ఈజీ కాకపోవచ్చు. అలాగని ఆసాంతం గిల్లికజ్జాలు ఉంటాయనుకోనక్కర్లేదు. ఎందుకంటే.. వైఎస్ అభిమానులుగా షర్మిల తెలంగాణ ఎంట్రీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి, భట్టి విక్రమార్క స్వాగతించారు. ఆమధ్య జానారెడ్డిని కలిసిన షర్మిల.. తాను తెలంగాణలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాకపోతే.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ఆయన వర్గం బలంగా ఉన్నప్పుడు, ఆయనే వ్యతిరేకిస్తున్నప్పుడు షర్మిల ఎలా సర్దుకుపోగలరనేదే ప్రశ్న.
వాయిస్ః జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పాలేరుపై షర్మిలకు హామీ దక్కలేదేమోనని అనుకుంటున్నారు. పాలేరు హామీ ఇచ్చి ఉంటే.. ఈపాటికే విలీనం అయిపోయి షర్మిల హడావుడి కనిపించేది. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ వర్ధంతి సందర్భంగా ఏదో ఒక నిర్ణయం జరిగేది. కాని, అలా జరగలేదు. పైగా 17న భారీ సభ జరుగుతోంది. అయినా సరే.. ఇంకా డెసిషన్ ఫైనల్ కాలేదు. అంటే అర్థం.. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిలను రానివ్వొద్దన్న రేవంత్‌రెడ్డి మాటే చెల్లుబాటు అవబోతోందా? రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా డీకేను, అటు అధిష్టానాన్ని రేవంత్‌రెడ్డి ఒప్పించారా?
సరే.. ఒకవేళ తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వద్దంటే.. ఏ ఆప్షన్ ఉంది? షర్మిలకు ఆల్రడీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు టాక్. కర్నాటక నుంచి ఎంపీగా రాజ్యసభకు పంపించడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ డీకే ఎంత చెబితే అంత. మరి రాజ్యసభ సీటు టికెట్‌కే పరిమితం అవుతారా షర్మిల. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. షర్మిల పార్టీని కలుపుకొని.. ఆ తర్వాత ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలనేది కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన. మరి అలాగే జరుగుతుందా అనేది చూడాలి. ఏదేమైనా.. షర్మిల కాంగ్రెస్‌లో ఇమడడం అంత ఈజీనా అనేదే ప్రశ్న. అలాగని సపోర్ట్ దొరకదని కాదు. మద్దతిచ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు. వైఎస్‌తో అనుబంధం ఉన్న జిల్లాలు చాలానే ఉన్నాయి తెలంగాణలో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, పాలేరు, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల ప్రజలు, నాయకుల్లో వైఎస్ అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. సో, షర్మిల కలిసిపోగలరు. కాని, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌తో, ఆ వర్గంతో ఇముడుతూ సర్దుకుపోగలరా అనేదే డౌట్.
షర్మిలనే కాదు.. కాంగ్రెస్‌లో చేరిన, చేరుతున్న నాయకులు కూడా పార్టీలో సర్దుకుపోగలరా అనే ప్రశ్న వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి లీడర్లు వస్తున్నా.. టికెట్‌పై క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఇంకా టికెట్ హామీ దక్కలేదని చెబుతున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. జిట్టా చేరికను ఎంపీ కోమటిరెడ్డి వ్యతిరేకించినా.. పార్టీ పెద్దల జోక్యంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జాయినింగ్‌కు కూడా ఎంపీ కోమటిరెడ్డి అంగీకరించారు. అయితే, జిట్టాకు భువనగిరి, వేములకు నకిరేకల్ టికెట్ ఇస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ టికెట్, ఆరేపల్లి మోహన్ మానకొండూరు టికెట్ ఆశిస్తున్నారు. అయితే, వీళ్లంతా కాంగ్రెస్‌లో చేరుతున్నా.. ఎవరికీ ఫలానా నియోజకవర్గం అనే హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పాలిటిక్స్‌ను అర్థం చేసుకుని ఇమడగలుగుతారా.. లేదా ఇవే చేరికలు బూమరాంగ్ అవుతాయా అనేది త్వరలోనే తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..