
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. నిందితుడు పోలా రమేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మహబూబ్ నగర్, నల్గొండకు, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులను సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు అరెస్టుల సంఖ్య 77కు చేరుకుంది. త్వరలోనే అరెస్టుల సంఖ్య 100కు చేరుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికీ పలువురు అభ్యర్థులు పరారీలో ఉన్నట్టు సిట్ అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న అభ్యర్థులను కనుగొనేందుకు సిట్ అధికారులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. పోల రమేష్ నుండి పేపర్ తీసుకున్న అభ్యర్థులు ఒకరికి తెలియకుండా ఒకరు సైక్లింగ్ ప్రాసెస్ లో పేపర్ ను 35 మందికి అమ్ముకున్నారు. ఏఈ పేపర్ ను రమేష్ నుంచి తీసుకున్న అభ్యర్థులు ఎటువంటి డబ్బు ముందుగా ఇవ్వలేదు. పరీక్ష ముగిసిన తర్వాత ఉద్యోగం వచ్చాకే డబ్బులు ఇచ్చేలా రమేష్ తో అభ్యర్థులు ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఇలా రమేష్ నుండి పేపర్ పొందిన 30 మందిని సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో 22 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన అధికారులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
సిట్ ఇటీవల అరెస్టు చేసిన వారిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారు.. గత మూడు రోజుల క్రితం సిట్ అరెస్టు చేసిన వారిలో నాగరాజు అనే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. నాగరాజు భార్య శ్రీలత టైలర్ గా పనిచేస్తుంది. శ్రీలత కోసం డిఏవో పేపర్ ను రమేష్ నుండి తీసుకున్న ఆర్ఎంపి నాగరాజ్. డీఏవో పేపర్ కోసం రమేష్ కు ఎటువంటి డబ్బు చెల్లించలేదని నాగరాజు తెలిపాడు.
ఇప్పటివరకు అరెస్టు అయిన 77 మందిపై 381 409 420 411 120(b) 201 ఐపిసి తో పాటు ఐటీ ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు సిట్ ఆధికారులు. ఇటీవల అరెస్టు అయిన విద్యార్థుల పేర్లు అశోక్, కళ్యాణ్, నాగరాజు నాయక్, విజయ్ కుమార్, అజయ్, సునీల్, సంతోష్, రాముడు, నరేందర్, సంజీవ్, చంద్రశేఖర్, రాజేష్ తదితరులు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..