తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష హాల్ టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల అనంతరం ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. కాగా పోలీసులు కొలువులకు యువతలో ఎంతో క్రేజ్ ఉంది. అవకాశం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈసారి కూడా కానిస్టేబుల్ పోస్టులకు విపరీతమైన పోటీ నెలకొంది. కేవలం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షకు 1,06,272 మంది పోటీపడుతున్నారు. అంటే ఒక్కోపోస్టులకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నమాట. అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. వీరంతా ఈ నెలలో జరగబోయే తుది రాత పరీక్షకు పోటీ పడుతున్నారు.
కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు పార్ట్–2 దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్ పోస్టులకు ఎంత మేర పోటీ ఉందన్న విషయం స్పష్టం అవుతోంది. సివిల్ పోలీస్, టీఎస్‌ఎస్పీ, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్లశాఖ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఈనెల తుది రాత పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాత పరీక్షకు హాజరయ్యేవారంతా అధికారిక వెబ్‌సైట్ లో లాగిన్ ఐడీ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీస్ నియామక మండలి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.