
సున్నితమైన అంశం అని చూడకుండా ప్రతిపక్షాలు ఇంటర్ ఫలితాల పట్ల విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మా కుటుంబంలో పిల్లలకు ఇబ్బంది కలిగినట్టు భావించి సమస్య పరిష్కారానికి తాము చూస్తుంటే… కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల్లో కొంత టెక్నికల్ సమస్య వచ్చింది నిజమే అని… దాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బాల్క సుమన్ అన్నారు. ఈ విషయంలో కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు అని సుమన్ మండిపడ్డారు. ఈ టెండర్ గ్లోబరీనాకు కట్టబెట్టింది కేటీఆర్ అని రేవంత్ ఆరోపించడాన్ని బాల్క సుమన్ తప్పుబట్టారు. అప్పట్లో ఇది విద్యాశాఖ పరిధిలోని అంశమని అన్నారు.
రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే వేల కోట్ల కుంభకోణమని విమర్మలు చేస్తుంటారని, అది కేవలం నాలుగు కోట్ల టెండర్ మాత్రమే అని సుమన్ అన్నారు. దాన్ని వేల కోట్ల టెండర్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొడంగల్ లో ఓడిపోయినా కూాడా రేవంత్ రెడ్డికి బుద్ది రాలేదని సుమన్ విమర్శించారు. కేటీఆర్‌పై చేసిన విమర్శలకు 24 గంటల్లో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.