పండగల సమయంలో బహుమతులు పంచడం లేదా.. ఎవరైనా ప్రముఖులు లేదా కొంతమంది తమ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున భోజనాలు పెట్టడం లేదా, ఏవైనా బట్టలు, గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. అలాగే మనకు ఏదైనా అదృష్టం కలిసివచ్చి.. సంతోషంగా ఉన్నా సరే ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేయడం కోసం బహుమతులు పంచుతూ ఉంటారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ అభిమాన నాయకుడి పుట్టినరోజుకో లేదా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానో కేక్ లు కట్ చేయడం, బహుమతులు పంచడం కూడా చూస్తుంటాం. కాని ఓ టీఆర్ ఎస్ నాయకుడు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. తెలంగాణ సీఏం కేసీఆర్ దసరా రోజు జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈసందర్భంగా దేశ్ కీ నేత అంటూ కేసీఆర్ తో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంతో పాటు ఆ శుభసందర్భాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీఆర్ ఎస్ నాయకులు. దీనిలో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి కేసీఆర్, టీఆర్ ఎస్ పై అభిమానంతో తన ఆనందాన్ని చాటుకోవడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మరిన్ని విజయాలను సాధించాలని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్ చౌరస్తాలో 200 మంది పేద హమాలీలకు ఒక్కొక్క కోడితోపాటు ఒక క్వార్టర్ విస్కీ బాటిల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.
సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్వీట్లు, పండ్లు లేదా దుస్తులు వంటివి పంచిపెడుతూ ఉంటారు. కాని ఈ టీఆర్ ఎస్ నాయకుడు మాత్రం కొంత వినూత్నంగా ఆలోచించి ఏకంగా మద్యం బాటిళ్లతో పాటు, కోళ్లను పంచిపెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్, కేటీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి, వాటికి పూల దండలు వేశారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు వంటివి ఆయన అభిమానులు చేస్తున్నారు.
తెలంగాణ సీఏం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారనే విషయాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ ఎస్ కార్యకర్తలు భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ దేశ్ కీ నేత ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటుచేశారు. తమ నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న ఆనందంలో ఉన్నారు టీఆర్ ఎస్ శ్రేణులు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తూ వస్తున్న కేసీఆర్, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ రెండూ పార్టీలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేయడం ద్వారా దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను పరిచయం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్ దేశ వ్యాప్తంగా కూడా పర్యటించనున్నారు. మొదటగా ఆయన మహారాష్ట్రలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులను కూడా తన పార్టీలోకి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించి, ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ లు కేసీఆర్ జాతీయ పార్టీపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని, అయితే కేసీఆర్ జాతీయ పార్టీ వల్ల ఆయనకు పెద్ద ప్రయోజనం ఏమి ఉండబోదని బీజేపీ నాయకులు చెబుతండగా, కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో విఫలమైన కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిం ఏం చేస్తారంటూ విమర్శిస్తున్నారు.
#WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU
— ANI (@ANI) October 4, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..