
మెదక్ జిల్లా తూప్రాన్ లో ట్రైనీ విమానం ప్రమాదానికి గురైంది. రావెల్లి సమీపంలో ట్రైనింగ్ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. దుండిగల్ ఎయిర్ పోర్టుకు చెందిన విమానంగా గుర్తించారు అధికారులు. పైలట్, ట్రైనీ పైలట్ అక్కడికక్కడే మంటల్లో చిక్కుకుని మృతి చెందారని ప్రథమిక విచారణలో తేలింది. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నయన్నారు పోలీసులు. ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక మృతదేహాల్ని అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఉదయం ఎనిమిది గంటల సమయంలో రావెల్లి గ్రామ సమీపంలోని కొండల్లో పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూస్తే విమానం మంటల్లో దగ్ధమవుతున్న దృశ్యాలు కనిపించాయని చెప్పారు. పెద్ద ఎత్తున మంటలతోపాటూ దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..