తెలంగాణలో ఉచిత విద్యుత్ దుమారం ఇంకా కొనసాగుతోంది. రాజధాని నుంచి మూరుమూల గ్రామం వరకూ పార్టీలకు ఇదే ప్రచారాస్త్రం అయింది. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తూ ఊరూ వాడా అధికారపార్టీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా రైతు క్లస్టర్ల నుంచి తీర్మానం చేపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఉచిత విద్యుత్ 8గంటలు చాలంటున్న రేవంత్‌రెడ్డి ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టగలరా అంటూ సవాల్ విసురుతున్నారు మంత్రులు. దమ్ముంటే 24గంటల ఉచిత విద్యుత్ అనే సింగిల్ పాయింట్ అజెండాతో ఎన్నికలకు వచ్చే దమ్ముందా అంటూ కేటీఆర్ చేసిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 24గంటలు విద్యుత్ ఎక్కడా ఇవ్వడం లేదని చర్చ మొదలైన వెంటనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు నిరంతరం విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటోంది కాంగ్రెస్. 24గంటల ఉచిత విద్యుత్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందంటున్నారు హస్తం నేతలు. ఫ్రీపవర్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ పొన్నం గుర్తు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో రాజుకున్న కరెంట్ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎన్నికల వరకూ ఇదే ప్రధాన అజెండాగా మారబోతుంది. అనూహ్యంగా అందివచ్చిన అస్త్రంగా అధికారపార్టీ భావిస్తుంటే.. దీనిపై చర్చ కూడా ఎంతోకొంత పార్టీపై జనాల్లో చర్చ జరిగేలా చేసిందన్న అభిప్రాయంలో కాంగ్రెస్ ఉంది.
తాజాగా 24 గంటల కరెంట్‌పై చర్చకు సిద్ధమా? అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ‘తెలంగాణలో ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని నిరూపిస్తా. కేటీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తా. రైతు వేదికలపై చర్చకు సిద్ధం. ఉచిత కరెంట్ 24గంటలు ఇవ్వడం లేదన్న మాటకు కట్టుబడి ఉన్నాం. మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గంలో అయినా చర్చకు రెడీ.త్రీఫేజ్ కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సింగిల్‌ఫేజ్ కరెంటే 24 గంటలు ఇస్తున్నారు. సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్స్ దాచిపెట్టి టైమింగ్స్ కేవలం వైట్ పేపర్లలో రాస్తున్నారు. పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి. రైతులకు సింగిల్ ఫేజ్ ఇస్తున్నామని అధికారులే చెప్పారు. విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు. దీనిపై చర్చకు సిద్ధమా? 8 నుంచి 9వేల కోట్ల రూపాయలు డబ్బు ఎటు పోతుంది. నిజం కాదా?…’ అని కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు రేవంత్ రెడ్డి.
మరోవైపు రేవంత్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి. గోడలపై రాతలు రాసుకునే వ్యక్తికి వ్యవసాయం ఏం తెలుసని విమర్శించారు. రైతులకు క్షమాపణ చెప్పి రేవంత్ ముక్కు నేలకు రాయాలన్నారు. ‘రేవంత్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు. గోడలపై రాతలు రాసుకునే వ్యక్తికి వ్యవసాయం ఏం తెలుసు. రైతులకు క్షమాపణ చెప్పి రేవంత్ ముక్కు నేలకు రాయాలి. రాహుల్‌గాంధీకి రైతుల బాధలు ఏం తెలుసు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఉందా. కాంగ్రెస్ హయాంలో రైతుబిడ్డలకు పిల్లనిచ్చేవారు కాదు. ఒకప్పుడు భూమికి ధరలు లేక నేను కూడా అమ్ముకున్నాను. కేసీఆర్ పాలనలో ఆ భూములు కోట్లు పలుకుతున్నాయి. ఉచితవిద్యుత్ కోసం రూ.12 వేలకోట్లు ఖర్చుచేస్తున్నాం’ అని ఎర్రబెల్లి మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..