Adilabad, July 15: అసలే దొంగలుపడి టమాటను బంగారంలా ఎత్తుకెలుతున్న కాలం ఇది. టమాట పంటను కాపాడుకోవడానికి బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకుని రక్షణ కల్పించుకుంటున్న టైం ఇది. ఇలాంటి టైంలో క్వింటాల్ల కొద్ది టమాటలు రోడ్డు పైన కనిపిస్తే ఇంకేమైనా ఉందా టమాటలను ఎగబడి ఎత్తుకెళ్లడం ఖాయం. టమాటల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో అక్కడ అలాంటి సీనే కనిపించింది. కానీ పోలీసులు అప్రమత్తమై టమాటలకు సెక్యూరిటి కల్పించడంతో ఏకంగా 22 లక్షల విలువైన టమాట లోడ్ సేప్ అయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల బైపాస్ వద్ద చోటు చేసుకుంది. కర్ణాటక కోలార్ నుండి టమాటాల లోడుతో వెళ్తున్న ఓ లారీ ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద బోల్తా పడింది. జాతీయ రహదారి 44 పై స్కూటీని తప్పించబోయి అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ , ఇద్దరు క్లీనర్లు , మరో ఇద్దరు సహాయకులు క్షేమంగా బయటపడగా.. టమాటాలు పెద్ద మొత్తంలో రోడ్డు పాలయ్యాయి.
లారీలో దాదాపు 22 లక్షల విలువ చేసే 18 టన్నుల టమాటాలు ఉన్నాయని లారీ డ్రైవర్ తెలిపాడు. ప్రమాదం జరగగానే 100 కు ఫోన్ చేశానని.. పది నిమిషాల సమయంలోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో టమాటలకు రక్షణ లభించిందని తెలిపాడు. యజమానికి సమాచారం ఇచ్చామని.. నాందెడ్ నుండి మరో లారీ రాగానే లోడ్ ను తరలించే ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సగానికి పైగా టమాటలు నుజ్జు నుజ్జు అవడంతో 10 లక్షల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానిక టమాట వ్యాపారులు అంచనా వేశారు. ప్రస్తుతం లోడ్ చేరుకోవాల్సిన ఢిల్లీ, గుర్గావ్, లక్నో లాంటి నగరాల్లో కిలో టమాటా రూ. 250 వరకూ పలుకుతుందని తెలిపారు వ్యాపారులు.
రేట్లు భారీగా పెరుగుతుండటం డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేక పోవడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోను కిలో టమాట ధర రూ. 120 పైనే పలుకుతుందని.. ఇలాంటి సమయంలో ఇలా ప్రమాదాల భారీన పడి టమాటాలు నేలపాలైతే రేట్లు మరింతగా పెరిగి సామాన్యులపైనే పడుతుందని అంటున్నారు స్థానికులు. ఏది ఏమైనా స్థానికుల సహకారంతో బంగారం లాంటి టమాట నేలపాలైనా ఒక్కటంటే ఒక్క టమాట కూడా చోరీకి గురి కాకుండా కాపాడగలిగారు స్థానిక పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..