మీరు తాటి కల్లు తాగి ఉంటారు.. ఈత కల్లు రుచి చూసి ఉంటారు. కానీ వేప కల్లు ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? అసలు దాని గురించి ఎప్పుడైనా విన్నారా..?. అవునండీ ఇప్పుడు మీకు వేప కల్లు గురించి వివరించబోతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గొల్ల నిరంజన్ అనే వ్యక్తి ఇంటిదగ్గర గల వేప చెట్టు నుండి గత కొద్ది రోజులుగా కల్లు వస్తుంది. వేప చెట్టు నుంచి నురగతో కల్లు లాంటి పదార్థం బయటకు వస్తోంది. అది వేప కల్లు అంటూ… టేస్ట్ బాగుందంటూ.. కొందరు స్థానికులు దాన్ని తాగుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యంగా చెట్టును సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం తండోపతండాలుగా తరలివచ్చి చూస్తున్నారు. ఈత చెట్టుకో..తాటిచెట్టుకో కల్లు రావడం సహజం.. కానీ, వేప చెట్టుకు కల్లు ధారలుగా రావటంతో జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా, వేపకల్లు ఆరోగ్యానికి మంచిదని.. అనేక రోగాలు నయమవుతాయని చెబుతున్నారు. కళ్ల సమస్యలు ఉన్నవారికి వేప కల్లు పరిష్కారమంటున్నారు. కొందరు ఈ వేపకల్లును సీసాల్లో పట్టుకుపోతున్నారు. వేపచెట్టుకు కల్లు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.