
అందరూ కలిసి, ఓ మాట అనుకుని, డిక్లరేషన్ పాస్ చేశారు. ఏమని.. ఒక కుటుంబం ఒక టికెట్టే అడగాలి అని. అందరూ సరే అన్నారు, దానికే కట్టుబడి ఉంటాం అన్నారు. తీరా ఎన్నికలు దగ్గరికొచ్చి, ఇక టికెట్లు ప్రకటిస్తారనగా.. అందరూ ఢిల్లీ బాట పట్టారు. ఎందుకని.. మా ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వండని అడగడానికి. కాంగ్రెస్ పాస్ చేసిన ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ఆపార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. రీజన్ ఒక్కటే.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఈ రేంజ్‌లో పెరుగుతుందని కొన్ని నెలల ముందు వరకు ఆపార్టీ నేతలే ఊహించలేదు. కొన్ని పరిణామాల కారణంగా మళ్లీ అధికారికంలోకి వస్తామన్న ఆశ పెరగడంతో ఈసారి ఛాన్స్ వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్లు. అందుకే, వారసులను కూడా రంగంలోకి దింపుతున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలిసారే తమ వారసులను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే తపన కూడా ఇందుకు కారణం. తాము రాజకీయాల్లో ఉండగానే వారసులను ప్రయోజకులను చేయాలనే ఆతృత సీనియర్లలో కనిపిస్తోంది. అందుకే, ఎలాగైనా సరే రెండేసి టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సీనియర్ నేత జానారెడ్డి తనతోపాటు తన ఇద్దరు కుమారులకు సీట్లు కావాలని కోరుతున్నారు. ఇస్తే తన ఇద్దరు కుమారులకు టికెట్లు ఇవ్వాలని.. లేదంటే తనకు మాత్రమే ఇవ్వాలని హైకమాండ్‌కు చెప్పేశారు. వారిలో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని అధిష్టానానికి వివరించారు. పైగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జానారెడ్డి కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. అంటే జానారెడ్డి ఫ్యామిలీ మొత్తం మూడు టికెట్లు అడుగుతోంది. నాగార్జున సాగర్, మిర్యాలగూడతో పాటు ఎంపీ టికెట్ కూడా అడుగుతున్నారు జానారెడ్డి. ఎంపీ టికెట్ అడగడానికి టైం ఉండడంతో.. తన ఇద్దరు కుమారులకు టికెట్లు ఇప్పించడానికి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటి నుంచో రెండు టికెట్లు అడుగుతున్నారు. కోదాడ నుంచి పద్మావతి, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. బహుశా ఉత్తమ్ ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వడానికి పెద్ద అడ్డంకులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కుటుంబంలో ఇద్దరు టికెట్లు అడుగుతుంటే గనక.. అందులో రెండో వ్యక్తి కచ్చితంగా ఐదేళ్ల పాటు పార్టీలో పనిచేస్తూ ఉండాలనేది నిబంధన. దాని ప్రకారం ఉత్తమ్ ఫ్యామిలీకి రెండు టికెట్లు ఖాయం అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిబంధన అప్లై చేస్తే కనీసం పది మందికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ మాహబూబాబాద్ నుంచి పోటీకి దరఖాస్తు చేయగా.. ఆయన కుమారుడు సాయిశంకర్ నాయక్ ఇల్లందు నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు. ఎమ్మెల్యే సీతక్క ములుగు నుంచి, ఆమె కుమారుడు సూర్య పినపాక నుంచి పోటీ చేసేందుకు అర్జీలు పెట్టుకున్నారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి, ఆమె భర్త కొండా మురళి పరకాల నుంచి బరిలో దిగేందుకు అప్లై చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, అయన కూతురు త్రిష రెండు టికెట్లు కోసం ప్రయత్నిస్తున్నారు. పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ కూడా తన ఇద్దరు కుమారులకు టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ నుంచి ఆయన సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి టికెట్స్ కావాలంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేఖా నాయక్ తనకు ఖానాపూర్ టికెట్‌తో పాటు తన భర్త శ్యామ్ నాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ డిమాండ్ చేస్తున్నారు. వీళ్లంతా ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు టికెట్ల అంశం తన పరిధి కాదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎప్పుడో ప్రకటించేశారు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అని చెప్పేశారు. దీంతో నేతలంతా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో సమావేశానికి పోటీపడుతున్నారు.
అసలు రెండు టికెట్ల కోసం ఈ రేంజ్‌లో డిమాండ్ చేయడానికి మైనంపల్లి హనుమంతరావే ప్రధాన కారణం అని చెబుతున్నారు. మల్కాజిగిరి టికెట్‌తో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ అడుగుతున్నారు మైనంపల్లి హనుమంతరావు. ఈ ఇద్దరికీ రెండు టికెట్లు కన్ఫామ్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అసలు రెండు టికెట్ల డిమాండ్‌తోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు మైనంపల్లి. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రెండేసి టికెట్లు ఇస్తూ.. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న తమకు రెండు టికెట్లు ఇవ్వరా అని నిలదీస్తున్నారు మిగిలిన నేతలు. దీంతో ఈసారికి ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పక్కనపెట్టాల్సి రావొచ్చనే టాక్ నడుస్తోంది. ఒక ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇస్తే.. మిగిలిన వారికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రెండేసి టికెట్లు ఇస్తే మిగిలిన వారికి అన్యాయం జరగొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి. బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలి, కమ్మ వర్గ నేతలు 10-12 సీట్లు అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారి కోటా ప్రకారం ఇవ్వాల్సిందే. వీరితో పాటు ఎప్పటి నుంచో కన్ఫామ్‌గా గెలుస్తున్న వారికీ టికెట్లు ఇవ్వాలి. ఇంత మందిని శాటిస్‌ఫై చేయడం కాంగ్రెస్‌కు కత్తి మీద సామే.
కేవలం కాంగ్రెస్‌లోనే కాదు.. బీజేపీలోనూ రెండు టికెట్లు ఆశిస్తున్న వాళ్లున్నారు. రీసెంట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు టికెట్లు డిమాండ్ చేశారు. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నందున.. తన భార్యకు మునుగోడు టికెట్ ఇవ్వాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి డిమాండ్‌ను నెరవేర్చాల్సిందే. ఆల్రడీ ఈటల రాజేందర్ ఫ్యామిలీ కూడా రెండు టికెట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ నుంచి ఈటల, గజ్వేల్ నుంచి ఈటల జమున బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది. అయితే, బీజేపీ కూడా వన్ ఫ్యామిలీ వన్ టికెట్‌కే కట్టుబడి ఉంది. కాని, ప్రత్యేక కారణాల దృష్ట్యా బీజేపీ కూడా రెండు టికెట్లు ఇవ్వాల్సి రావొచ్చు. అటు ఈ రెండు టికెట్ల గోల మొదలైందే బీఆర్‌ఎస్‌లో. రెండు టికెట్లు ఇవ్వనందుకే మైనంపల్లి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే, ఇప్పుడు అదే మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే.. బీఆర్‌ఎస్‌లోనూ వన్ ఫ్యామిలీ టూ టికెట్స్ నడవొచ్చని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద వన్ ఫ్యామిటీ టూ టికెట్స్ అంశం పార్టీలకు పెద్ద తలనొప్పినే తెచ్చిపెడుతోంది. ఇవ్వడానికి ఇబ్బంది లేదు గానీ.. కుటుంబానికి రెండేసి సీట్లు ఇస్తే మరొకరికి కచ్చితంగా అన్యాయం జరుగుతుంది. అంటే, చేజేతులా కొత్త సమస్యను కొనితెచ్చుకున్నట్టే. ఈ డిమాండ్లు ఇంకా ఎక్కువైతే.. అసలుకే నష్టం జరగొచ్చు కూడా. మరి ఈ సమస్యను పార్టీలు ఎలా ఫేస్ చేస్తాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..