Telangana: అరెరే ఎంత ఘోరం జరిగిపోయింది.. చోరీ కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
ఇంటి పైకప్పు ఎక్కి బయట దూకే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. అంతే ఇంకే తెల్లారి చూసేసరికి శవం అయి తేలాడు. అయితే మరో దొంగను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ మద్యం మత్తులో ఉన్నాడని వదిలేయడంతో మరో దొంగ ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మేన్ సెంటర్ లో..

మంచిర్యాల, ఆగష్టు 08: ఓ ఇద్దరు దొంగలు ఓ ఇంటికి కన్నే వేసేందుకు వచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కి దూరారు. అందినకాడికి దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. అంతే ఇంటి యజమాని అప్రమత్తమవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఓ దొంగ ఇంటి పైకప్పు ఎక్కి బయట దూకే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. అంతే ఇంకే తెల్లారి చూసేసరికి శవం అయి తేలాడు. అయితే మరో దొంగను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ మద్యం మత్తులో ఉన్నాడని వదిలేయడంతో మరో దొంగ ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మేన్ సెంటర్ లో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఓ ఇంట్లో గురువారం మద్యాహ్నం దొంగలు పడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లేందుకు ఇళ్లంతా వెతికారు.. ఏం దొరకకపోవడంతో పక్కింటికి వెళ్లారు. అలికిడి వినిపించడంతో ఆ ఇంటి యజమాని అప్రమత్తమయ్యాడు. అలర్ట్ అయిన ఇద్దరు దొంగలు అక్కడి నుండి పారిపోయేందుకు ఇంటి పైకి ఎక్కి బాత్రూం పై నుండి కిందికి దూకారు. అయితే ప్రమాదవశాత్తు ఓ దొంగ పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో యజమాని కేకలు వేయడంతో స్థానికులు పారిపోతున్న మరో దొంగను పట్టుకున్నారు. అతన్ని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారించగా.. స్నేహితునితో కలిసి చుట్టాల ఇంటికి వచ్చానని ఓ సారి.. ఆస్పత్రికి వచ్చానని మరోసారి.. చోరీకి వచ్చానని ఇంకోసారి చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఆ దొంగను వదిలేశారు.
అయితే మరుసటి రోజు ఉదయం చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించిన రాఘవేంద్ర మెడికల్ యజమాని ఇంటి పెరంట్లోని బావిలో ఓ శవం కనిపించింది. ఆందోళన చెందిన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు దొంగగా గుర్తించారు. అయితే ముందు రోజే సీసీ పుటేజ్ పరిశీలించినా.. మద్యం మత్తులో ఉన్న దొంగను గట్టిగా విచారించినా బావిలో పడ్డ దొంగను ప్రాణాలతో కాపాడే అవకాశం ఉండేది కదా అని మంచిర్యాల వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అయ్యో పాపం దొంగ ఎంతపనైపాయే అంటూ జాలిపడ్డారు కూడా. ఘటనా స్థలాన్ని డీసీపీ సుధీర్ కేకన్ పరిశీలించారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చనిపోయిన దొంగ మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. త్వరలోనే దొంగకు సంబందించిన పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..