AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accidents: అగ్నిప్రమాదాల్లో కోల్పోతున్న ప్రాణాలు… కోలుకోలేని స్థితుల్లో మృతుల కుటుంబాలు

బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Fire Accidents: అగ్నిప్రమాదాల్లో కోల్పోతున్న ప్రాణాలు... కోలుకోలేని స్థితుల్లో మృతుల కుటుంబాలు
Nampally Fire Accident
Peddaprolu Jyothi
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 14, 2023 | 3:51 PM

Share

టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న టైమ్‌లో చిన్నపాటి అజాగ్రత్త ప్రమాదాల బారిన పడేలా చేసింది. బాణాంచా పేలిన ఘటనలు, అగ్నిప్రమాదాలు చాలా మంది లైఫ్‌లో చీకట్లు నింపాయి. అత్యధికంగా ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో జరిగాయి. బజార్ ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ దుర్ఘటనలో ఏకంగా తొమ్మిది నిండు ప్రాణాలు అగ్నికి అహుతయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపింది. అపార్ట్‌మెంట్ సెల్లార్లో అక్రమంగా రసాయనాల్ని నిల్వ చేస్తున్నట్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చేసిన ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

సాధారణంగా రసాయన గోదాములు నిర్వహణకు స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అనుమతి పొందిన ప్రాంతంలో కాకుండా పలుచోట్ల అక్రమంగా గోదాములు నిర్వహిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే బహిర్గతమవుతుండటం యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తోంది. వాస్తవానికి జనావాసాల్లో ఇలాంటి రసాయనాల్ని నిల్వఉంచడం నిషేధం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల రెడ్, ఆరెంజ్ విభాగంలోని సుమారు 1,350 పరిశ్రమల్ని వెలుపలికి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.

రసాయనాలు లేదా ఇతర సామగ్రిని నిల్వ ఉంచిన ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 2021లో 139, 2022లో 236, ఈ ఏడాది ఆగస్టు నాటికి 132 ప్రమాదాలు ఈ తరహావే కావడం గమనార్హం. బజార్ ఘాట్ ప్రమాదంతోసహా గడిచిన ఏడాదిన్నర కాలంలో ఒక్క రాజధాని ప్రాంతంలోనే అయిదు ఘోర దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏకంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

-సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ గోదాంలో గతేడాది మార్చిలో జరిగిన ఘోర దుర్ఘటనలో 11 మంది బిహారీ వలస కూలీలు అగ్నికి ఆహుతయ్యారు.

-సికింద్రాబాద్ రూబీ హోటల్ సెల్లార్లో గతేడాది సెప్టెంబరులో జరిగిన దుర్ఘటనలో 8 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. సెల్లార్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

-సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ నిట్వేర్ స్పోర్ట్స్ షాపులో గత జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు బిహారీలు జునైద్, వసీం, జాహెద్ దుర్మరణం పాలయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటటలు అంటుకుని పైకి వ్యాపించిన ఈ ప్రమాదంలో మరో నలుగురిని రక్షించగలిగారు.

-ప్రమాదాన్ని నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 గంటలు శ్రమించాల్సివచ్చింది. మృతదేహాలు పూర్తిగా దహనమైన స్థితిలో బయటికి తీసుకొచ్చినా వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఈ అక్రమ నిర్మాణాన్ని తర్వాత కూల్చివేశారు.

-సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్ మార్చి 17న జరిగిన అగ్నిప్రమాదంలో క్యూనెట్ సంస్థ ఉద్యోగులు శివ, ప్రశాంత్, వెన్నెల, పరిమళ, శ్రావణి, త్రివేణి దుర్మరణం పాలయ్యారు.

-తాజాగా బజార్ ఘాట్ లో ని నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్నిప్రమాద ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. నాంపల్లి ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది మృతిచెందడం విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు గవర్నర్‌ సంతాపం తెలియజేశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాంపల్లి ప్రమాదస్థలిని పరిశీలించి.. ప్రమాదంపై ఆరా తీశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ఉన్న కెమికల్‌ గోడౌన్లను శివారు ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు కిషన్‌రెడ్డి. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…