Telangana: ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు లిస్ట్ శుక్రవారం విడుదల కానుంది. దీన్ని కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్ కాలేజీల్లో 2025-26గానూ ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అగస్టు 10 వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఎప్‌సెట్, సీసీబీ, జోసా షెడ్యూల్‌కు అనుగుణంగా దీనిని రూపొందించారు. అప్లికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
మరోవైపు ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు లిస్ట్ శుక్రవారం విడుదల కానుంది. తమకు ఎక్కడ సీటు వస్తుందోనంటూ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 28న మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 95,256 మంది విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో సుమారు 94వేల మంది నచ్చిన కాలేజీల్లో సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏ కాలేజీలో సీటు వస్తుందోననే టెన్షన్ విద్యార్థుల్లో నెలకొంది. ఈ సారి ఫైస్ట్ టైమ్ మాక్ అలాట్‌మెంట్ విధానాన్ని ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా నచ్చిన కాలేజీలో సీటు రాకపోతే.. తొలివిడత సీట్ల కేటాయింపుకు ముందే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ మార్పు చేసుకునే వీలును కల్పించారు.
జూలై 12న ఈ విధానంలో 77వేల 154మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే అందులో 44వేలకు పైగా విద్యార్థులు తమకు నచ్చిన సీటు రాలేదని మళ్లీ కొత్త ఆప్షన్లు పెట్టుకున్నారు. దీంతో పెట్టుకున్న కాలేజీ వస్తుందా..? రాదా..? అనే టెన్షన్ విద్యార్థుల్లో నెలకొంది. ఇక రెండో విడత సీట్ల కేటాయింపు లిస్ట్ అగస్టు 10లోపే విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
