Telangana Vaccination: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గత పది రోజులుగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు తొలి విడతగా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఇక ప్రైవేటు సిబ్బంది కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం ఈ కార్యక్రమం సజావుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 495 కేంద్రాల్లో 20,359 మందికి టీకా వేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ప్రైవేటు వైద్య సిబ్బంది ఐదుగురిలో స్వల్ప దుష్ప్రభావాలు గుర్తించామని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు టీకాలు వేసుకున్నారు. వీరిలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, ఏఐజీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ జీవీ రావు, డాక్టర్ రఘోత్తమ్‌రెడ్డి, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్, సీరియన్ ఆర్ధోపెడిక్ డాక్టర్ కేజే రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జయరాం, సిటీ సర్జన్ డాక్టర్ గోపాల కృష్ణ గోఖలే, డాక్టర్ ఇవితా ఫెర్నండేట్ ఉన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కలిగినవారికి నిమ్స్‌లో చికిత్స అందించేందుకు ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయడం సోమవారంతో పూర్తయింది. ఈనెల 16న ప్రారంభించిన టీకా పంపిణీ.. 4,296 మందికి టీకా ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3,962 మందికి వేసినట్లు అధికారులు తెలిపారు.