నిన్న అదొక మృత్యుసొరంగం.. నేడు రాజకీయ రణరంగం..! టన్నెల్ చుట్టూ తన్నులాట!
తెలంగాణ పునర్మిర్మాణాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నా.. ఆ దిశగానే కష్టపడుతున్నా.. అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి దగ్గిర రాష్ట్రంపై తనదైన ముద్ర ఉండాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. మూసీ నదిని పునరుజ్జీవింప జేయడం.. రాజధానికి నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించడం.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేవంత్‌రెడ్డి రిపీటెడ్‌గా చెబుతూ వస్తున్న వాగ్దానాలివి. కానీ... రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌గా తీసుకుని అమలుచేస్తున్న ఇటువంటి మానస పుత్రికలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో మరొకటి ఎస్ఎల్బీసీ.

డ్యామ్స్ అండ్ పాలిటిక్స్.. మన జలాశయాలు-వాటికి పొంచి ఉన్న గండాలు.. అనే సబ్జెక్ట్ మీద మొన్నటిదాకా రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. దీనికి నేపథ్యం కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ డ్యామ్ కుంగడం. విచారణ కమిషన్ గేరు మార్చినట్టే.. పొలిటికల్ బ్లేమ్‌గేమ్ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇది చాలదా అన్నట్టు.. కొత్తగా యాడైన మరో చాప్టర్.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుంగుబాటు. దీని మీద రగులుతున్న రాజకీయరచ్చయితే వేరే లెవల్..
గాల్లో దీపాల్లా మిణుకు మిణుకుమంటున్న ఎనిమిది ప్రాణాలు.. దుర్ఘటన జరిగి వారం రోజులవుతున్నా వాళ్లసలు ఉన్నారో పొయ్యారో కూడా బైటికి చెప్పుకోలేని దైన్యత. NDRF, ఆర్మీ, నేవీ, SDRF, సింగరేణితోపాటు.. ఐఐటీ మద్రాస్, L&T టీమ్, జార్ఖండ్ మైనింగ్ టీమ్.. మొత్తం 9 రకాల బృందాలు SLBC దగ్గర మోహరించి.. ప్రతీ క్షణమూ విలువైనదిగా భావించి.. మొన్నటిదాకా యుద్ధప్రాతిపదికన సాగింది రెస్క్యూ ఆపరేషన్. కానీ.. అది చాలా రిస్కీ ఆపరేషన్‌గా మారిందని, లోపలికి మెషినరీ తీసుకెళ్లే మార్గం కూడా లేదని దాదాపుగా చేతులెత్తేసింది ప్రభుత్వం.
అటు.. ప్రమాద స్ధలం పూర్తిగా బురదమట్టితో నిండిపోవడంతో.. SLBC టన్నెల్‌లో భయానక వాతావరణం నెలకొంది. టర్బో బోరింగ్ మిషన్‌ను విరగ్గొడితే గాని లోపలికి వెళ్లే ఛాన్స్ లేకపోవడం.. మట్టిపెళ్లలు నాన్‌స్టాప్‌గా ఊడిపడ్డం.. జియాలజీ నిపుణులు సైతం ఏమీ చెప్పలేకపోవడం.. ఇవన్నీ కలిపి రెస్క్యూ టీమ్స్‌ని ముందుకు కదలనివ్వడం లేదు. ఆ ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారు? ప్రమాదస్థలికి అవతల ఉన్నా.. సేఫ్‌గానే ఉన్నారా? అనేది కూడా అంతుబట్టకుండా ఉంది. ఆపరేషన్ జిందగీ-2 ఆసాంతం అయోమయంగా మారింది. అదలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా మొదలైంది ఆపరేషన్ రాజకీయ జగడం.
ఎనిమిదిమంది ప్రాణాలకు జవాబుదారీ మీదే అని ప్రతిపక్ష బీఆర్ఎస్ రంకెలేస్తుంటే.. చెయ్యగలిగిందల్లా చేస్తున్నాం.. మా దగ్గర శక్తివంచన లేదు అని సమర్థించుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. అటు వీళ్లిచ్చే స్టేట్‌మెంట్లు ప్రాజెక్టు ఉనికిపై కూడా డౌట్లు పుట్టేలా చేస్తున్నాయి. అసలు ప్రాజెక్టే దండగని వాళ్లు.. పూర్తయితే పండగేనని, ఆరునూరైనా పూర్తి చేస్తామని వీళ్లు.. కామెంట్లు-కౌంటర్లతో నోర్లకు పని చెప్పేశారు. ఇలా పొలిటికల్ చాప్టర్ ఎంట్రీ ఇవ్వడంతో యమా హీటెక్కిపోయింది SLBC సబ్జెక్ట్.
తెలంగాణ టన్నెల్ పాలిటిక్స్‌లో లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే.. బీఆర్‌ఎస్ నేతల ఎస్‌ఎల్‌బీసీ సందర్శన. SLBC దగ్గర సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి..? ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకూ ఉంది.. అంటూ ఛలో ఎస్ఎల్‌బీసీ ప్రోగ్రాం చేపట్టింది గులాబీ దండు. ప్రతిపక్ష నేతలు వెళ్లకూడదని, రాజకీయం చేయడం తగదని ప్రభుత్వం అడ్డుచెప్పినా ససేమిరా అంటూ హరీష్‌రావుతో పాటు 17 మంది నేతలు SLBCకి తరలివెళ్లారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్ శ్రమను అభినందిస్తూనే, ప్రభుత్వ తీరును మాత్రం నిగ్గదీస్తోంది బీఆర్‌ఎస్.
పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి అసలు కారణం ప్రభుత్వ అలసత్వమేనని డే-వన్ నుంచి ఆరోపిస్తూ వస్తోంది విపక్షం. నిజానికి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పైకప్పు కూలిందని తెలియగానే అప్రమత్తమైంది రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి రేవంత్‌కి ప్రధాని మోదీ సైతం ఫోన్ చేసి సహకారానికి హామీ ఇచ్చి ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్‌ని పంపారు. సైన్యాన్ని రంగంలో దింపారు. అటు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ.. దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ షురూ చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. కానీ.. ఈ క్రమంలోనే అసలు కంటే కొసరే ఎక్కువైందంటూ విమర్శలకూ తావిచ్చారు.
టన్నెల్ దగ్గర కూర్చుని ఇరిగేషన్ మంత్రి, ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగడం తప్ప ఒరిగేదేమీ లేదంటూ తాకిడి పెంచింది బీఆర్‌ఎస్. కానీ.. పదేళ్లుగా పనిచేయకపోవడం వల్లనే SLBC కూలిపోయిందనేది అధికారపార్టీ రివర్స్ ఎటాక్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం తగదన్నారు సీఎం రేవంత్. కమిషన్లు రావన్న కక్కుర్తితో గతంలో కేసీఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును అటకెక్కించారనేది రూలింగ్ పార్టీ అభియోగం. ఒక ముఖ్యమంత్రిగా రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్ఠి పెట్టాల్సిన బాధ్యత మరిచి.. ఢిల్లీ టూర్ల పేరిట టైమ్‌పాస్ చేస్తారా..? ఢిల్లీలో కూర్చుని పిచ్చి పిచ్చి చిట్‌చాట్లేంటి.. ఇలా బీఆర్‌ఎస్ ఎటాకింగ్ స్టయిల్ మామూలుగా లేదు. తెలివైనవాళ్లకి, ఫూల్స్‌కీ మధ్య తేడా ఇదీ అంటూ ప్లాటో మాటను పోస్ట్ చేసిన కేటీఆర్.. ప్రభుత్వాన్ని మరింత లోతుగా గుచ్చారు. ఈ విధంగా టన్నెల్ ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్సులో పడేలా వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది అపోజిషన్ పార్టీ.
ఏపీలో పోలవరం లాగే.. తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ. ఇది నాలుగు దశాబ్దాల నాటి కల. కానీ.. ఎప్పటికి సాకారమవుతుందో తెలీదు. ఎన్‌టీఆర్‌తో మొదలుపెట్టి నలుగురు ముఖ్యమంత్రుల్ని దాటుకుని వచ్చినా పూర్తికాని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నిర్మాణం తన హయాంలో పూర్తి చేయాలన్నది రేవంత్ రెడ్డి తీసుకున్న కమిట్‌మెంట్. కాళేశ్వరం ప్రాజెక్టుతో అపర భగీరధుడన్న ట్యాగ్‌లైన్ సొంతం చేసుకుని, ఆ మేరకు కీర్తికిరీటాలు తొడిగించుకున్నారు కేసీఆర్. 40 ఏళ్ల నాటి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కలను సాకారం చేస్తే తనకూ అటువంటి క్రెడిట్ దక్కవచ్చన్నది రేవంత్ ఆలోచన కావొచ్చు. అందుకే అధికారంలోకి వచ్చీ రాగానే.. ఎస్‌ఎల్‌బీసీ స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని, ప్రాజెక్టును మళ్లీ మొదలుపెడితే వచ్చే సవాళ్లపై చర్చించి.. బడ్జెట్‌లో రూ. 800 కోట్ల నిధులు కేటాయించి.. 2026 నాటికి పూర్తి చేయాలని కమిటైంది రేవంత్ సర్కార్. కానీ.. పనులు మొదలుపెట్టిన నాలుగైదు రోజుల్లోనే సొరంగంలో ప్రమాదం జరగడం.. ఎస్‌ఎల్‌బీసీకి సడన్ బ్రేక్ పడ్డం.. జరిగిపోయింది.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు ఆదినుంచి సినిమా కష్టాలు. మొదలవడానికి ముందు బాలారిష్టాలు. ఇప్పుడు అంతకుమించిన ఇక్కట్లు. నల్గొండ, పాలమూరు జిల్లాల్ని పట్టించుకోకపోతే శాశ్వతంగా ఎడారులుగా మారిపోతాయన్న బెంగతో ఉమ్మడి రాష్ట్రంలో హైరానాతో మొదలుపెట్టారంటూ ఈ ప్రాజెక్టు ఆలోచన మీదే విమర్శలున్నాయి. 70 ఏళ్ల కిందట ప్రతిపాదించిన ఏలేశ్వరం ప్రాజెక్టు రాకుండా సమైక్య పాలకులు కుట్రపూరితంగా అడ్డుకున్నారని, అందువల్లే నల్గొండ నష్టపోయిందని విభజనకు ముందు నుంచీ ఆక్రోశిస్తోంది తెలంగాణ. ఈ తాకిడి తట్టుకోలేక ఆగమేఘాల మీద చెన్నారెడ్డి హయాంలో ఎస్‌ఎల్‌బీసీకి బీజం పడింది.
ఎన్‌టీఆర్ జమానాలో ఆలోచన జరిగింది. వైఎస్‌ఆర్ టైమ్‌లో నిర్మాణం మొదలైంది. కానీ.. అడుగడుగునా అడ్డంకులే. ఎందుకంటే.. అత్యంత ఖర్చుతో కూడుకున్న క్లిష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఒకవేళ నానాయాతనా పడి టన్నెల్ పూర్తయినా నదిలో 854 అడుగుల మేర నీళ్లుంటేనే సొరంగం ద్వారా కిందకు నీళ్లొచ్చే ఛాన్సుండేది. కానీ.. అప్పటికే రాయలసీమ ఎత్తిపోతల కారణంగా 798 అడుగుల దిగువనే సెటిలవుతోంది నీటిమట్టం. అది 854 అడుగులకు చేరే ప్రసక్తే లేదంటూ.. SLBCకి తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా.. కేసీఆర్ హయాంలో కూడా ఎస్‌ఎల్‌బీసీని రీస్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నం జరిగింది. కానీ.. నీటి ఊట ఆగకపోవడం, టన్నెల్ నుంచి నీళ్లను బైటికి తోడేందుకే నెలకు కోటిన్నర దాకా ఖర్చవడం.. ఇవన్నీ చూసి ప్రాజెక్టుపై వెనక్కు తగ్గింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం.
ఇదొక దిక్కుమాలిన ప్రాజెక్టు.. మొదలుపెడితే ముందుకూపోదు వెనక్కూ పోదు.. అంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ తనదైన భాషలో క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. SLBC ఒక ఫెయిల్యూర్ డిజైన్ అని కేసీఆర్ చెప్పినా.. రేవంత్ సర్కార్ గుడ్డిగా ముందుకెళ్లిందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. పనులు మొదలుపెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్ జరిగిందా? జియొలాజికల్ సర్వే చేయించారా..? అని నిలదీస్తోంది. గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడి సొరంగ నిర్మాణాన్ని చేపట్టారని, మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి.. పబ్బం గడుపుకుంటారా.. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అంటూ ఎదురుదాడికి దిగింది రేవంత్ ప్రభుత్వం.
పూర్తయితే ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. కానీ.. పూర్తి చేయడం ఎలా..? సినిమా కష్టాల బారిన పడ్డ ఎస్‌ఎల్‌బీసీని గట్టున పడెయ్యడం ఎలా..? అనేవి సాంకేతికపరమైన సందేహాలు. వీటికి వ్యాల్యూ యాడ్ చేస్తూ.. కొత్తకొత్త స్టేట్‌మెంట్స్ ఇస్తున్నాయి అపోజిషన్ పార్టీలు. అధికార పార్టీ మాత్రం నా దారి రహదారి అంటూ ముందుకే చూస్తోంది. పాము-నిచ్చెన ఆటలా మారిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు భవితవ్యం ఏంటి? అనేది మిలియన్ క్యూసెక్కుల ప్రశ్న.
ఐదు లక్షల ఎకరాలను సారవంతం చేయడం, వందలాది ఫ్లోరైడ్ బాధిత గ్రామాల గొంతు తడపడమే లక్ష్యంగా మొదలైంది ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు. 2010లోగా పూర్తి చేయాలన్నది పునాదిరాయి పడ్డప్పుడు పెట్టుకున్న టార్గెట్. కానీ.. 2014 దాకా కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే తవ్వగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత దాన్ని కొనసాగించాలని సంకల్పించి.. 11 వందల 27 కోట్ల రూపాయల నిధులిచ్చి సొరంగాన్ని ఇంకో 11 కిలోమీటర్లు తవ్వగలిగింది కేసీఆర్ ప్రభుత్వం. మొత్తం 33 కిలోమీటర్లు పూర్తయింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా 11 కిలోమీటర్ల సొరంగం తవ్విన కేసీఆర్ పనితీరు గొప్పదా.. పని మొదలెట్టగానే 8 మంది ప్రాణాలను పణంగా పెట్టిన రేవంత్ పెర్ఫామెన్స్ గొప్పదా.. అంటూ చర్చ పెట్టింది బీఆర్‌ఎస్ పార్టీ.
సాగునీటి అవసరాల కోసం 44 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ తవ్వడం అనేదే పెద్ద సాహసం. ఆ దిశగా ప్రపంచంలోకెల్లా ఫస్ట్ ఎక్స్‌పరిమెంట్ ఇది. అప్పటివరకూ ఒకటీరెండు కిలోమీటర్ల రోడ్ టన్నెల్స్, రైల్వే టన్నెల్స్ మాత్రమే తవ్విన అనుభవం ఉంది. అయినా.. జేపీ లాంటి జెయింట్ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చి.. ధైర్యంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్‌లెట్, ఔట్‌లెట్ అంటూ రెండువైపుల నుంచి పక్కా ప్లానింగ్‌తో తవ్వకం మొదలుపెట్టినా.. ఆశించినంత వేగంగా పనులు జరగలేదు. బేరింగ్స్ చెడిపోయి బోరింగ్ మెషిన్లు మొరాయించడంతో ఎనిమిదేళ్ల కిందట పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం వచ్చాక ఎస్ఎల్‌బీసీలో మళ్లీ కదలిక వచ్చింది. రేవంత్ కేబినెట్‌లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. రిస్క్ అని తెలిసినా.. ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణాన్ని భుజానికెత్తుకున్నారు. కానీ.. మూడునెలల నుంచి టన్నెల్‌లో సీపేజ్ వస్తూనే ఉంది. బొట్టుబొట్టుగా మొదలై.. తర్వాత ధారలా వస్తున్న లీకేజీని అరికట్టడం అసాధ్యంగా మారింది. దాని ఫలితంగానే ఒక్కసారిగా సొరంగం పైభాగం మొత్తం కూలిపోయింది.
ఎస్‌ఎల్‌బీసీలో వాడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్లు కొత్తవేమీ కాదు. 200 ఏళ్ల కిందటే కనిపెట్టి.. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో సక్సెస్‌ఫుల్‌గా సొరంగాలు తవ్విన చరిత్ర ఉంది. అయినా.. తాజా ప్రమాదంతో టీబీఎం మెషిన్ల పనితీరుపై సందేహాలు, జేపీ కంపెనీ నిర్లక్ష్యంపై విమర్శలు.. టోటల్‌గా ప్రాజెక్ట్ పురోగతిపై అనుమానాలు. ఇదిలావుంటే, SLBC ఖర్చు తాజా అంచనా రూ. 4 వేల 658 కోట్లు. ఇప్పటికే రూ. 2 వేల 646 కోట్లు ఖర్చైపోయింది. ఒక వైపు నుంచి 20.5 కిమీ, మరొక వైపు నుంచి 14 కి.మీ సొరంగం తవ్వకం పూర్తయింది. ఇపుడు సవాల్‌గా మారింది మిగిలిపోయిన ఆ తొమ్మిదిన్నర కిలోమీటర్లే. ఇప్పుడు సడన్ బ్రేక్ పడింది. జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి.. విచారణ మొదలుపెడితే మరింత జాప్యం తప్పదు. ఈ నేపథ్యంలో మిగతా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. అసలు ముందుకెళ్లాలా.. వెనక్కి తగ్గాలా అనే డైలమాతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. పైగా.. ఎస్‌ఎల్‌బీసీ విషయంలో మరో ప్రతికూల అంశం కూడా ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో చాలా దిగువన తవ్వుతున్న సొరంగం ఇది. పైభాగం నుంచి నిరంతరం నీటి ఊట వస్తూనే ఉంటుంది. అందుకే.. కెనాల్ పూర్తయినప్పటికీ.. తర్వాత నిర్వహణ సమయంలో ఇటువంటి సవాళ్లు తప్పవు. ఇంతటి కాంప్లికేటెడ్ ప్రాజెక్టును ఎలా కంటిన్యూ చేస్తారు.. అని విపక్షం ప్రశ్నిస్తుంటే.. ఆరునూరైనా ముందుకే వెళతాం అంటోంది అధికారపక్షం.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీతో పాటు.. కాంగ్రెస్ బిగ్‌విగ్ రాహుల్‌గాంధీ కూడా సీఎం రేవంత్‌రెడ్డిని అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అడుగుతూనే ఉన్నారు. రాహుల్ విత్ రేవంత్.. వీళ్లిద్దరి మధ్య చర్చ రెస్క్యూ ఆపరేషన్‌కి మాత్రమే పరిమితమౌతుందా.. లేక ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ నేపథ్యాన్ని, దాని వెనకున్న పొలిటికల్ ఇంట్రస్టులను కూడా ఆరా తీస్తున్నారా.. అనేది అంతర్గత వ్యవహారం. ఏదేమైనా.. ఎస్‌ఎల్‌బీసీ ఎపిసోడ్‌పై ఒక చేత్తో అధిష్టానానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూనే.. మరోచేత్తో అపోజిషన్ పార్టీ దాడిని దీటుగా ఢీకొడుతోంది రేవంత్ సర్కార్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..