Telangana Rains: తెలంగాణ ప్రజలకు రెడ్‌ అలర్ట్‌.. మరో నాలుగైదు రోజులు కుండపోత వర్షాలు..

Telangana Rains: తెలంగాణను ముసురు కమ్మేసింది, నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది. ఇప్పటికే ఊళ్లన్నీ నానిపోయాయ్‌!. అంతలోనే డేంజర్‌ అలర్ట్‌ ఇచ్చింది వాతావరణశాఖ. 13 జిల్లాల్లో కుంభవృష్టి ఖాయమని హెచ్చరించింది.

Telangana Rains: తెలంగాణ ప్రజలకు రెడ్‌ అలర్ట్‌.. మరో నాలుగైదు రోజులు కుండపోత వర్షాలు..
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది

Updated on: Jul 20, 2023 | 7:10 AM

Telangana Rains: ఉత్తర తెలంగాణ ప్రజలకు రెడ్‌ అలర్ట్‌, కాదుకాదు డేంజర్‌ వార్నింగ్‌ ఇది, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల్లో పడటం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. తెలంగాణకు డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ. 13 జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్ ఖాయమని హెచ్చరించింది. మరో నాలుగైదు రోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఇప్పటికే గోదావరి పరివాహక జిల్లాల్లో వరద నీరు పోటెత్తుతోంది. ముసురుపట్టి కురుస్తోన్న వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చుతున్నాయ్‌!..

ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ.. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్టు చెప్పింది. ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వెదర్‌ డిపార్ట్‌మెంట్‌. రాగల 24 గంటల్లో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ప్రాజెక్టులకు పొటెత్తుతున్న వరద..

భారీ వర్షాలకు కాళేశ్వరం, తాలిపేరు, కడెం, నిజాంసాగర్‌, మేడిగడ్డ ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుత్తోంది. భద్రాచలం దగ్గరైతే గంటగంటకీ గోదావరి నీటి మట్టం పెరిగిపోతూ భయపెడుతోంది. ఇప్పటికే భద్రాద్రిలో స్నాన ఘట్టాలు, పర్ణశాల నీట మునిగాయ్‌!. దాంతో, భక్తులను, ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి, శబరి, మున్నేరు, కిన్నెరసాని ఉగ్రరూపం దాల్చడంతో యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు మంత్రి పువ్వాడ.

ఇవి కూడా చదవండి

ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దవాగ, గుండి వాగు, దిందా వాగు ఉప్పొంగడంతో 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు, అటు మంచిర్యాల జిల్లాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో పర్యాటకుల్ని ఆపేశారు ఫారెస్ట్‌ అధికారులు.

హైదరాబాద్ లో..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. రోజంతా నాన్‌స్టాప్‌గా జల్లులు పడుతూనే ఉన్నాయ్‌!. దాంతో, హైదరాబాద్‌లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్‌. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ప్రజల్ని భయపెడుతున్నాయి. ఒకవేళ వాతావరణశాఖ అంచనాలే నిజమైతే వరద పోటెత్తడం ఖాయం. అందుకే, ముందే అలర్టైంది ప్రభుత్వం. ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..