Telangana: బీఆర్‌ఎస్ బీసీ నేతల సమావేశం.. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
బీసీలే టార్గెట్..ఎన్నికల టైం దగ్గరపడేకొద్దీ ఇప్పుడు అన్నీ పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. దశాబ్ధాలు గడుస్తున్నా రాజకీయంగా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదని ఆయా వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. జనాభాలో అందరికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, సీట్ల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇటు అధికార బీఆర్‌ఎస్ పార్టీ సహా ఇతర పార్టీలు కూడా బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని సంకల్పించాయి.

తెలంగాణలో జనాభాకు తగ్గట్టుగా బీసీలకు సీట్లు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది. సీట్ల కేటాయింపుల్లో మొదటి నుంచి అన్యాయం జరుగుతోందని ఆ సామాజికవర్గం నేతలు వాయిస్ వినిపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్‌ఎస్, బీసీ నేతలను టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో బీసీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. బీసీ బంధు అమలు, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? బీసీల ఓట్లు రాబట్టడంపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలను సంఘటితం చేస్తూ త్వరలోనే హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఆకలితోనైనా అలమటిస్తాం కాని, ఆత్మగౌరవాన్ని వదులుకోమని BRS బీసీ నేతలు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. బీసీ నాయకత్వం ఎదగకుండా అణిచివేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని BRS బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలను అవమానించడం కాంగ్రెస్ పార్టీ విధానమా అని ప్రశ్నించారు మంత్రి తలసాని. అటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కావాలనే అధికార బీఆర్‌ఎస్ పార్టీ బీసీల పేరుతో కాంగ్రెస్‌పై బురదజల్లుతోందన్నారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు కోమటిరెడ్డి.
మొత్తానికి ఎన్నికలు వచ్చినప్పుడే..బీసీ గర్జనలు, బీసీ డిక్లరేషన్లు పార్టీలకు గుర్తొస్తాయా..? అని ప్రశ్నిస్తున్నారు ఆ సంఘం నేతలు. ఎవరి చిత్తశుద్ధి ఏంటో ఈ ఎన్నికల్లో తేలిపోతుందంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
