
Telangana Elections: అయిపాయే.. ఐదేళ్ల పదవీ కాలం అయిపాయే.. మరోదఫా అధికారం కోసం ఎన్నికల సమయం రానే వచ్చే.. మరో రెండు మూడు నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకేముంది.. రాజులు తమ సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేస్తూ కత్తులు, కటార్లు సిద్ధం చేసుకున్నట్లుగా.. నేతలు తమ గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. అంతకంటే ముందుగా.. ఈ రాజకీయ రణరంగంలో విజయం కోసం ఆ భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వామివారిని ప్రసన్నం చేసుకుని, ఎన్నికల్లో గెలువచ్చని భావిస్తూ.. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేసేస్తున్నారు. అవును, ఈ సారి తమను గెలిపించు సామీ అంటూ.. నేతలు దేవుళ్లు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
దేవుడా.. ఓ మంచి దేవుడా.. మేము మళ్లీ గెలవాలి.. మళ్లీ మళ్లీ మేమే గెలవాలి అంటూ కొందరు.. దేవుడా ఈసారి కూడా టిక్కెట్ నాకే దక్కాలి.. నినే గెలవాలి అని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో గులాబీ పార్టీ(బీఆర్‌ఎస్) అభ్యర్థులు, ఎమ్మెల్యేలు రాజశ్యామల యాగంతో మొదలు సుదర్శన యాగాల్లో బిజీ అయ్యారు.
బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం.. టిక్కెట్ వచ్చిన వారి నుండి రాని వాళ్ళతో సహా అందరు దైవత్వంలోకి వెళ్లిపోయారు. ఎన్నడూ లేని విధంగా ఒకరిని చూసి ఒకరు పూజలు, యాగాలు చేస్తూ పొలిటికల్ సర్కిల్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మంత్రులతో మొదలు ఎమ్మెల్యేల వరకు పూజల్లో బిజీ అయ్యారు. బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు యాగాలు నిర్వహించడంలో పెట్టింది పేరు. అయన బాటలోనే ఇప్పుడు చాలా మంది నేతలు యాగాలు చేస్తున్నారు.
మళ్లీ గెలవాలని కొందరు.. మళ్లీ తమకే సీట్ రావాలని మరికొందరు నాయకులు రాజశ్యామల యాగం మొదలు సుదర్శన యాగాలు చేస్తున్నారు. తాండూర్‌లో టిక్కెట్ కోసం పట్నం మహేందర్ రెడ్డికి, పైలెట్ రోహిత్ రెడ్డికి మధ్య రచ్చ జరుగుతున్న సమయంలోనే తాండూర్‌లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాగం చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కూడా యాగం చేసి టిక్కెట్ దక్కించుకోగా.. అటు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య టిక్కెట్ ఎలా అయినా తనకే రావాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి కూడా టిక్కెట్ వచ్చిన సంతోషంలో కుటుంబంతో కలిసి యాగం చేశారు. అటూ రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ సుదర్శన యాగం చేయాగ.. మొన్నటికి మొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి యాగాలు చేశారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఎమ్మెల్యేలు జోరుగా పూజలు, యాగాలు చెయ్యడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఎవరి పూజలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..