Telangana: దేశంలోనే తిరుగులేని శక్తిగా తెలంగాణ.. తలసరి ఆదాయంలో రికార్డ్

తెలంగాణా రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం దేశంలోనే టాప్ రేస్ లో దూసుకుపోతోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెండురెట్లు మెరుగ్గా ఉందని ప్రభుత్వ..

Telangana: దేశంలోనే తిరుగులేని శక్తిగా తెలంగాణ.. తలసరి ఆదాయంలో రికార్డ్
Telangana
Follow us
Subhash Goud

|

Updated on: Jun 20, 2023 | 7:07 PM

తెలంగాణా రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం దేశంలోనే టాప్ రేస్ లో దూసుకుపోతోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెండురెట్లు మెరుగ్గా ఉందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల ఆదాయం మెరుగుపడుతున్నట్టు ఈ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.

తలసరిఆదాయం అంటే ఒక భౌగోళిక ప్రాంతం లేదా దేశంలో ప్రతి వ్యక్తి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక పదం అని చెప్పవచ్చు. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయాన్ని అర్థం చేసుకోవడానికి అలాగే ఆ ప్రాంతంలో జీవన నాణ్యతను పరిశీలించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఒక దేశం తలసరి ఆదాయాన్ని దేశం మొత్తం ఆదాయాన్ని దాని జనాభాతో భాగించడం ద్వారా లెక్కిస్తారు. అదేవిధంగా రాష్ట్రాల వారీగా కూడా ఈ లెక్కలు వేస్తారు.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం, తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికంగా (అన్ని రాష్ట్రాలలో) జాతీయ సగటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. జాతీయ తలసరి ఆదాయ సగటు రూ.1.72 లక్షలుగా ఉండగా.. అది తెలంగాణా రాష్ట్రం విషయంలో రూ.3.08 లక్షలుగా ఉంది. గత దశాబ్ద కాలంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన 2014-15లో తలసరి ఆదాయంలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో తలసరి ఆదాయంలో సగటు వృద్ధి రేటు 12.1 శాతంగా ఉందని, ఇది దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికమని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇక రాష్ట్రంలోనే, రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం అత్యధికంగా రూ.7.58 లక్షలు కాగా, వికారాబాద్ రూ.1.54 లక్షలతో అట్టడుగున ఉంది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) 2014-15లో రూ.5.05-లక్షల కోట్ల నుంచి 2022-23లో రూ.12.93-లక్షల కోర్‌కి పెరిగింది. తెలంగాణా జాతీయ GDPలో రాష్ట్రం 5 శాతం వాటాను కలిగి ఉంది.

ఇదిలా ఉంటే.. తలసరి ఆదాయం పరంగా తెలంగాణా నిలకడగా ఎదుగుతూ వచ్చింది. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 గా ఉండగా అది 2022-23 నాటికి రూ.3,08,732లకు పెరిగింది. కోవిడ్ సమయంలోనూ తెలంగాణా తలసరి ఆదాయం పెద్దగా ప్రభావం కాలేదు. కోవిడ్ ముందు అంటే 2019-20 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,31,326లుగా ఉండగా అది 2020-21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా రూ.2,25,687 లుగా ఉంది. అంటే ఈ సమయంలో కూడా తెలంగాణా రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం నిలకడగానే ఉందని చెప్పవచ్చు. 2014-15 నుంచి ఇప్పటివరకూ తెలంగాణా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఎలా ఉందో ఈ చార్ట్ చూసి తెలుసుకోవచ్చు.

2023-24 బడ్జెట్‌ను సమర్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు “తెలంగాణ తలసరి ఆదాయం 2013-14 నుంచి 1,12,162 నుంచి 2022-23 నాటికి 3,17,115 పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇది జాతీయ తలసరి ఆదాయం 1,70,620 కంటే 86 శాతం ఎక్కువ. ఇది స్పష్టంగా తెలంగాణలో జరుగుతున్న గణనీయ అభివృద్ధికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇదేమీ అంత సులభంగా సాధించిన విజయం కాదు. దీని వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి, విజన్ ఉన్నాయి. ఇక తెలంగాణ సాధించిన ఈ రికార్డు అభివృద్ధికి ఏఏ రంగాలు ఎంత తోడ్పడ్డాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం..

తెలంగాణా ప్రజల తలసరి ఆదాయం ఇలా రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రాథమిక రంగం ఎంతో సహకరించింది. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, అటవీ, ఫిషరీస్ విభాగాలు. వీటి నుంచి 2014-15 లభించిన సహకారం 19.5% తో పోలిస్తే.. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23లో 21.1% గా ఉంది. 2022-23లో ప్రాథమిక రంగం వృద్ధి రేటు 2014-15లో దాని వృద్ధి రేటు కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయం పై పెట్టిన ఫోకస్ సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పవచ్చు.

ఇక సెకండరీ సెక్టార్ అంటే తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా,ఇతర యుటిలిటీస్ నుంచి కూడా లభించిన సహకారం దేశంలోనే టాప్ స్థాయిలో తెలంగాణా నిలబడటానికి ఊతం ఇచ్చింది. ప్రస్తుత ధరల ప్రకారం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు అత్యధికంగా నమోదయ్యాయి. సెకండరీ సెక్టార్‌లోని అన్ని సబ్ సెక్టార్‌లలో 2014-15 నుంచి 2022-23 వరకు 186.2% వృద్ధి రికార్డ్ అయింది.

అదేవిధంగా తృతీయ రంగం అంటే వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, నివాసం, యాజమాన్యం, వృత్తిపరమైన సేవలు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ అలాగే ప్రసారానికి సంబంధించిన సేవలు, ప్రజా పరిపాలన వంటివి కూడా తలసరి ఆదాయ రికార్డులో గణనీయమైన మద్దతు ఇచ్చాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం 62.2% వాటాతో ప్రబలమైన రంగంగా నిలిచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి