హైదరాబాద్, ఏప్రిల్ 26: మత సామరస్యానికి, లౌకికవాదానికి భారత్ పుట్టిళ్లు . అందులో తెలంగాణలోని హైదరాబాద్ ‘మినీ భారత్’తో సమానం. ఎందుకంటే ఇక్కడకు ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి పలు రకాల మతాలకు చెందిన వారు వలస వస్తుంటారు. ఎందరు వచ్చినా మహానగరం కాదనక కడుపులో దాచుకుంటుంది. ఇక హైదరాబాద్‌లో ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రతీ విషయంలోనూ ఒకరికొకరు అండగా ఉంటుంటారు.
హిందువుల పండుగల్లో ముస్లింలు, ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటూ సంతోషాలను పంచుకుంటూ ఉంటారు. అలాంటి హైదరాబాద్‌లో తాజాగా మతసామరస్యాన్ని చాటే ఓ సంఘటన చోటు చేసుకుంది. హనుమాన్ ఆలయం కోసం ఓ ముస్లిం రూ.80 లక్షల విలువైన తన భూమిని విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ శివారు మెయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో ఇటీవల కొత్తగా హనుమాన్ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయంలో వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన సలావుద్దీన్ అనే ముస్లిం వ్యక్తి గ్రామంలో తనకు ఉన్న 5 గుంటల భూమిని ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే 600 చదరపు గజాల భూమన్నమాట. అందుకు సంబంధించిన పత్రాలు పూజారి రంగరాజన్‌కు అందజేశారు. లక్షలు విలువచేసే భూమిని సలావుద్దీన్ విరాళంగా ఇవ్వటంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చి, మత సామరస్యాన్ని చాటుకున్నాడని అందరూ కొనియాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.