Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్‌ విడుదలైనా కనిపించని హడావుడి!

ఓటమి ఓ అనుభవం.. రాబోయే విజయానికి సోపానం.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అనువుగా మలచుకుని ముందుకు సాగాలి. రాజకీయమైనా, మరెక్కడైనా..! ఇదేకదా అందరూ అనుకునేది. అదేంటో మరి, తెలంగాణలో పదేళ్లు అధికారం చలాయించిన ఆ పార్టీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఎన్నిక ఏదైనా ఎగిసిపడే ఉత్సాహంతో ముందుకొచ్చే ఆ పార్టీ... ఎందుకిలా వ్యవహరిస్తోంది? అన్నదీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలకు కారు దూరమా? షెడ్యూల్‌ విడుదలైనా కనిపించని హడావుడి!
KCR
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Balaraju Goud

Updated on: Jan 29, 2025 | 3:12 PM

ఉద్యమకాలం నుంచి… నేటిదాకా, ఎన్నికలేవైనా, ఉప ఎన్నిక ఏదైనా.. పోటీకి సై అంటూ దూకుడుగా ముందుకొచ్చే గులాబీ పార్టీ.. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ధోరణి మార్చేసినట్టు కనిపిస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తూ.. మరోసారి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న బీఆర్‌ఎస్‌ పెద్దలు.. త్వరలో జరగునన్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం.. ఎటూ తేల్చలేకపోతున్నారు. ఏ ఎన్నికలైనా సవాల్‌గా తీసుకుని పోరాడే తెలంగాణ భవన్‌ ఉరఫ్‌ బీఆర్‌ఎస్ భవన్‌.. కీలకమైన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైనా కామ్‌గానే ఉంది. పోటీకి దూరమన్నట్టుగా పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపుతోంది.

ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ‌ఎన్నికపై ఇప్పటికే ‌ప్రధా‌న పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే, మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఅర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలకి దూరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పలువురు అశావాహులు సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నా.. పార్టీ నుంచి మాత్రం ఎక్కడా అధికారిక సమావేశం జరగలేదు. ఉత్తర తెలంగాణలో 40 నియోజకవర్గాలను కవర్‌ చేసే ఈ ఎమ్మెల్సీ స్థానంలో.. బీఆర్‌ఎస్‌కు గట్టిపట్టే ఉంది. ప్రతీ ఎన్నికల్లో కారు దూకుడు.. ఒక రేంజ్‌లో కనిపించేది. ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణలో ఇది అత్యంత కీలకమైన ఎన్నికగా‌ చెప్పొచ్చు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావుల నియోజకవర్గాలు సైతం.. ఈ ఎమ్మెల్సీ పరిధిలోనే ఉన్నాయి. అయినా సరే, పోటీ విషయంలో‌ మాత్రం ఆ పార్టీ స్పష్టత ఇవ్వడం లేదు.

ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్‌ కూడా అన్నివిధాలా సన్నద్ధమవుతోంది, రేపోమాపో అభ్యర్థిని ప్రకటించి కార్యక్షేత్రంలోకి దిగబోతోంది. అయితే, బీఅర్ఎస్‌లో మాత్రం చడీచప్పుడు లేదు. నామమాత్రపు చర్చ కూడా పార్టీలో జరగడం లేదంటే.. ఈ ఎన్నికల్లో గులాబీ దళం పోటీకి దూరంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా.. మాటవరసకైనా ఎమ్మెల్సీ ఎన్నికల ఊసెత్తలేదు. నేతలతోనూ చర్చించలేదు. అశావాహులు తనను కలిసి, అవకాశం ఇవ్వాలని కోరినా, ఎలాంటి సమాధానం ఇవ్వలేదట.

ఈ మూడు స్థానాల పరిధిలో.. బీఆర్‌ఎస్‌కు భారీగా ఆశావహులున్నారు. వేల సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. మరి, పార్టీ పోటీకి దూరంగా ఉంటే.. వాళ్లంతా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని పరిస్థితి. మద్దతుదారులు ఓకే.. ఆశావహుల పరిస్థితే అగమ్యగోచరంగా మారేలా ఉంది. పార్టీ హైకమాండ్‌ సంకేతాలతో కొందరు సైలెంట్‌గా ఉంటే.. మరికొందరు మాత్రం ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఇన్వాల్వ్‌మెంట్‌ లేకుండానే.. ఎన్‌రోల్‌మెంట్‌ చేయించారు. అయితే, వరుస పోరాటాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనకడుగు వేయడం ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందట. దూకుడు మీదున్నప్పుడు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీకి మైనస్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓడినా, గెలిచినా… పోటీచేసి తీరాలని మెజార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, రాబోయే స్థానిక‌ సంస్థల ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. కాబట్టి, గెలిచి తీరాలన్న సంకల్పంతో కాంగ్రెస్‌, బీజేపీలు పనిచేస్తున్నాయి. మరి, పోటీ విషయంలో బీఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గడం నిజమే అయితే.. ఆ పార్టీ మంచి అవకాశాన్ని వదులుకున్నట్టేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండు జాతీయ పార్టీలు సై‌ అంటుంటే.. రాష్ట్రంలో బలమైన ఒకేఒక్క స్థానిక పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రం నై అంటుండటం ఆసక్తి రేపుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..