Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పరువు హత్యలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు.. ఆమె కళ్ళల్లో ఆనందం కోసమే..?

సూర్యాపేట జిల్లాలో యువకుడి హత్య కలకలం రేపుతోంది. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్‌ దగ్గర కృష్ణ అనే యువకుడి మృతదేహం లభించింది. మామిళ్లగడ్డకు చెందిన కృష్ణని అతి కిరాతంగా బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన యువతిని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు కృష్ణ. పలు కేసుల్లో కృష్ణ నిందితుడిగా ఉన్నాడు.

Telangana: పరువు హత్యలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు.. ఆమె కళ్ళల్లో ఆనందం కోసమే..?
Suryapet Honor Killing Case
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Jan 29, 2025 | 2:56 PM

రాష్ట్రంలో సంచలన సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటిని హత్య చేసి మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని రాత్రి 8 గంటల పాటు నిందితులు షికారు చేశారు. పరువు హత్యకు భార్గవి నానమ్మే ప్రతీకారమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కృష్ణను హత్య చేసేందుకు నిందితులు రెండు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నవీన్ ను రెచ్చగొట్టిన నాయనమ్మ..

సూర్యాపేటకు చెందిన కృష్ణ అలియాస్ మాలబంటి, పిల్లలమర్రికి చెందిన నవీన్ ఇద్దరి సాధారణ పరిచయమే ఉంది. నవీన్ సోదరి భార్గవిని ఓ యువకుడు లైంగికంగా వేధించాడు. దీంతో నవీన్.. కృష్ణ సహాయంతో ఆ యువకుడిని బెదిరించారు. ఆ తర్వాత నవీన్.. కృష్ణలిద్దరూ స్నేహితులుగా మారారు. కృష్ణ తరుచూ పిల్లలమర్రిలోని నవీన్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. ఇదే క్రమంలో భార్గవి, కృష్ణలు ప్రేమలో పడ్డారు. అయితే భార్గవికి ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇంతలోనే భార్గవి, కృష్ణలు ఆరు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. భార్గవి గౌడ కులానికి చెందిన యువతి కాగా, కృష్ణ ఎస్సీ వర్గానికి చెందినవాడు. అయితే వీరి కులాంతర ప్రేమ వివాహాన్ని భార్గవి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్ని నెలలుగా తన కుమారుడు, మనుమళ్లను భార్గవి నానమ్మ బుచ్చమ్మ రెచ్చగొడుతోంది.

ఆరుగురు కలిసి చేసిన హత్య..

స్నేహితుడుగా వచ్చి తన సోదరిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవడాన్ని నవీన్ జీర్ణించుకోలే కృష్ణపై రగిలిపోయాడు. దీనికి తోడు భార్గవి ఇంట్లో ఆధిపత్యాన్ని చలాయించే నానమ్మ బుచ్చమ్మ కూడా నవీన్‌ను మరింత రెచ్చగొట్టింది. కృష్ణ అలియాస్ మాలబంటిని హత్య చేసేందుకు రెండు నెలల క్రితమే పథకం వేశాడు నవీన్. తాళ్లగడ్డకు చెందిన మహేశ్ తోపాటు నల్గొండకు చెందిన యువకుడి సాయాన్ని నవీన్ తీసుకున్నాడు. ఈ ప్లాన్ లో భాగంగానే కృష్ణతో మహేశ్ స్నేహం చేస్తున్నట్లు నటించాడు. కృష్ణను హత్య చేసే పథకాన్ని జనవరి 19వ తేదీన అమలు చేయాలని చూసినా సాధ్యం కాలేదు. చివరికి జనవరి 27వ తేదీ ఆదివారం రాత్రి కాపు కాసి హతమార్చారు.

స్నేహితుడు బైరు మహేష్ ఫోన్ చేయడంతో కృష్ణ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. సూర్యాపేట శివారులో ఉన్న మహేష్ వ్యవసాయ పొలం వద్ద కృష్ణను నవీన్, మహేష్ మరో నలుగురు కలిసి ఉరి వేసి హత్య చేశారు. రాత్రంతా కారులో మృతదేహంతో షికారు. కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పడవేయాలో తెలియక కారు డిక్కీలో వేసుకుని రాత్రివేళ 8 గంటల పాటు ఆరుగురు నిందితులు తిరిగారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచారు.

అనంతరం నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి డెడ్ బాడీని చూపారు. మృతదేహాన్ని నల్గొండ పరిసరాల్లోనే వదిలేయాలని భావించినా సాధ్యం కాక తిరిగి సూర్యాపేటకు తీసుకొచ్చారు. చివరికి పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారని పోలీసులు తెలిపారు. భార్గవి నానమ్మ బుచ్చమ్మ తోపాటు సోదరుడు నవీన్, మహేష్ లతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ పరువు హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..