Telangana Minister Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తొడగొట్టారు. రాజీనామా చేద్దాం.. ఎన్నికలకు పోదాం అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.. ఎవరు గెలిస్తే వాళ్లే హీరో.. ఓడిపోతే జీరో అంటూ ఆవేశంతో ఊగిపోయారు.‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తా.. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అని రేవంత్‌రెడ్డికి మల్లారెడ్డి సవాల్ విసిరారు.
సంచలనాలకు మారుపేరు అయిన మంత్రి మల్లారెడ్డి.. మరోసారి దుమ్ము రేపారు. మాటలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మూడు చింతలపల్లిలో 40 గంటల పాటు దళిత, గిరిజన దదీక్ష చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. మూడు చింతల పల్లి కేసీఆర్ దత్తత గ్రామమని.. ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. మూడు చింతల పల్లి మండలం మొత్తం టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలే ఉన్నారని స్పష్టం చేశారు..
రేవంత్ రెడ్డి ముచ్చింతలపల్లిలో ఎందుకు దీక్ష చేసాడో తెలియదన్న మల్లారెడ్డి.. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. మంచినీళ్లు, పెన్షన్లు వస్తున్నాయన్న ఆయన.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని లబ్ది పొందిన వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లే కార్డ్స్ పెట్టి నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం పథకాలు లేని ఇల్లు లేదు.. మిగితా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు చేయలేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.. కాగా, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
Read Also…
నాడు రూ.251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ ఊదరగొట్టి..ఇప్పుడు మళ్ళీ కటకటాల్లోకి.. ఎవరా ఛీటర్ .?