Harish Rao: టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు, బకాయిలు వెంటనే చెల్లించండి.. వైద్యాధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం

వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగారు. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులతో సమావేశమయ్యారు.

Harish Rao: టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు, బకాయిలు వెంటనే చెల్లించండి.. వైద్యాధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం
Minister Harish Rao
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2021 | 5:43 PM

Minister Harish Rao Health Review:  వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగారు. బుధవారం బీఆర్కే భవన్‌లో ఆయన వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ పని తీరుపై స్వల్పకాల సమీక్ష చేశారు. ఇవాళ హైద‌రాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేశామని హరీష్ రావు తెలిపారు. వ్యాక్సినేష‌న్‌ను మ‌రింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు హ‌రీష్‌రావు. గురువారం బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. అదే స‌మ‌యంలో జాతీయ స్థాయిలో మొద‌టిడోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా న‌మోదైంద‌ని వెల్లడించారు.

రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, టీకాలు, కొత్త మెడిక‌ల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం, వ‌రంగ‌ల్‌లోని మ‌ల్టీ సూప‌ర్ స్పెషాల్టీ ఆసుప‌త్రి నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. నిర్మాణ ప‌నులు వేగంగా పూర్తయ్యేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని, వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగాన్ని మ‌రింత పెంచాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. త్వరలోనే టిమ్స్ ఆస్పత్రి పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా నియంత్రణలో భాగంగా టీకా పంపిణీలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేష‌న్ కార్యక్రమంపై శ‌నివారం అన్ని జిల్లాల క‌లెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని హరీష్‌రావు తెలిపారు.

అలాగే, క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టడంతో 350 ప‌డ‌క‌లు గ‌ల కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో సాధార‌ణ వైద్యసేవ‌లు పున‌రుద్ధర‌ణ‌ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టిమ్స్ హాస్పిట‌ల్‌లో 200 ప‌డ‌క‌లను కోవిడ్ చికిత్స కోసం కేటాయించి మిగిలిన వాటిల్లో సాధార‌ణ వైద్య సేవ‌లు కొనసాగించాలని మంత్రి సూచించారు. అంత‌కుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ‌తో జ‌రిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హ‌రీష్ రావు, వైద్యారోగ్యశాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో క‌రోనా కేసులు, వ్యాక్సినేష‌న్ కార్యక్రమం గురించి వివ‌రించారు.

Read Also… Governor’s Conference: ప్రజలకు, ప్రభుత్వానికి గవర్నర్‌ ఓ స్నేహితుడు.. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు