Harish Rao on BJP: గోబెల్స్ ప్రచారం మానుకోండి.. బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోలు విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో భవన్‌లో గురువారం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
Harish Rao Fire on BJP: ధాన్యం కొనుగోలు విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో భవన్‌లో గురువారం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనడంలో పంజాబ్‌కు ఒక నీతి. తెలంగాణకు మరో నీతా అని నిలదీశారు మంత్రి హరీష్‌రావు. ప్రతిగింజా కొంటామని హామీ ఇచ్చిన కేంద్రం నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలని బీజేపీ నేతలకు హరీష్ రావు సవాల్ విసిరారు. ధాన్యం కొనవద్దని చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలే వడ్లు కొనాలి అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నదాతలు పండించిన ప్రతి గింజ కొనేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రానికి- రాష్ట్ర బిజేపీకి మధ్య సమన్వయం లేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు.
కేసీఆర్ కిట్‌లో కేంద్రం రూ. 5 వేలు ఇస్తుందని బీజేపీ నాయకులు చెప్తే సవాల్ చేశాను.. ఒక్కరూ కూడా ముందుకు రాలేదన్నారు. గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రం వ్యాట్ విధిస్తుందని అంటే చాలెంజ్ వేశాను. బీజేపీ నాయకులు రాలేదు. సిలిండర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధించడం లేదు. గోబెల్స్ ప్రచారానికి బీజేపీ పాల్పడుతోంది. రైతుల నుంచి బీజేపీకి మద్దతు లేదు. రాష్ర్ట ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాల హక్కులను అమలు చేయించాలని మంత్రి హరీష్ రావు.. బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. ఎన్సీడీసీ కోసం నాలుగైదు స్థలాలను చూపించాం. ఐసీఎమ్ఆర్‌లో ఎన్సీడీసీ కోసం మూడు ఎకరాల స్థలం కావాలని అడిగితే కేంద్రం నుంచి స్పందన లేదని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నాలు రేపటితో ప్రారంభం అవుతాయన్న మంత్రి.. భవిష్యత్‌లో అవసరం అయితే ఢిల్లీలో కూడా ధర్నాలు చేస్తామన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి పచ్చి అబద్ధాలు ట్విట్టర్ లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు.. అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర బిజెపి నాయకులతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇది కేంద్రం సవతితల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు హరీష్‌రావు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్రం స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి బిల్డింగ్‌ను కేటాయించిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదే అని హరీశ్ రావు స్పష్టం చేశారు. 20 జనవరి 2015న బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్ ఆస్పత్రికి కేటాయించామన్న హరీష్.. భవనంతో పాటు 201 ఎకరా 24 గుంటల భూమిని కూడా ఏడాదిన్నర క్రితం కేటాయించామన్నారు. మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన కిషన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. చిత్తశుద్ది ఉంటే మెడికల్ కాలేజీలకు, ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేయించాలని సూచించారు.
తెలంగాణకు రావల్సి సంస్థల గురించి విభజన చట్టంలో ఉందన్న మంత్రి.. దాన్ని తుంగలో తొక్కారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇది ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గిరిజన యూనివర్సిటీని, నవోదయ విద్యాలయాలను రాష్ట్రానికి ఇప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్సీలపై ప్రేమ ఉంటే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలి. బీసీల జనగణన చేయించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నాం అని హరీశ్‌రావు అన్నారు.