
ప్రగతి భవన్, రాజ్ భవన్‌ల మధ్య వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హీరో రజినీకాంత్ మెచ్చుకుంటుంటే, గవర్నర్ మాత్రం తలదించుకునేలా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ ఎప్పుడూ కలవవంటూ G-20 సదస్సులో తమిళిసై చేసిన కామెంట్స్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయన్న మంత్రి.. తమిళిసై గవర్నరా? లేక ప్రతిపక్ష నాయకురాలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోటీ చేసి గెలిచారని.. మరి మీరు ఎక్కడైనా గెలిచారా అంటూ హరీష్ రావు నిలదీశారు.
సచివాలయం ప్రారంభోత్సవానికి పిలవలేదన్న గవర్నర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు. గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అన్నారు. వందేభారత్ రైళ్ల ప్రారంభోత్సవానికి ప్రధాని రాష్ట్రపతిని ఎక్కడైనా ఆహ్వానించారా అని ప్రశ్నించారు. మరి రాష్ట్రపతి కూడా తనను పిలవడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలోనూ గవర్నర్ తీరు సరిగా లేదన్నారు మంత్రి హరీష్‌రావు. 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులపై ఇదే గవర్నర్ సంతకం పెట్టారని, మరి ఇప్పుడు ఆ 7 బిల్లులు ఆపడం వెనుకున్న రాజకీయం ఏంటో చెప్పాలని అన్నారు.?
ప్రభుత్వం పంపిన బిల్లులు రాజ్యాగ నిబంధనలు, కోర్టు తీర్పులకు భిన్నంగా ఉందా అన్నదే గవర్నర్ చూడాలన్నారు. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే బిల్లు
వెనక్కి ఎలా పంపుతారని ప్రశ్నించారు. కేబినెట్ ప్రామాణికమా లేక ఎమ్మెల్యే లెటర్ ముఖ్యమా చెప్పాలన్నారు. బిల్లులను ఆపడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని విమర్శించారు. బిల్లులో మార్పులు చేసే అధికారం గవర్నర్‌కు లేదని.. ఇప్పటికే మంత్రులు వెళ్లి వివరణ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..