Telangana: ఇంటి వద్దకే “మీ సేవ” సర్వీసులు.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు.. ప్రభుత్వం గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ఇందుకోసం డోర్ డెలివరీ సేవలను తాజాగా ప్రారంభించింది. దీంతో ఇంటి వద్ద నుంచే ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇంటి వద్దనే మీ సేవ సర్వీసులు పొందవచ్చు. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖకు సంబంధించిన సేవలు, ఆధార్ సేవలు, పలు ధృవీకరణ పత్రాల సర్వీసులు ఇంటి వద్దనే మీరు పొందవచ్చు. ఇందుకోసం ముందుగా 1100 టోల్ ఫ్రీ నెంబర్, మీ సేవ వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విడతల వారీగా దీనిని ప్రవేశపెట్టనుండగా.. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.
మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవల ద్వారా మీరు మీ సేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఆన్ లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే మీ సేవ ఏజెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ నేరుగా మీ ఇంటికే వచ్చి అవసరమైన పత్రాలను పరిశీలిస్తారు. అనంతరం దరఖాస్తు ప్రక్రియ చేపడతారు. డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్, కులం, ఆదాయం, నివాసం, ఈబీసీ, డబ్ల్యూఎస్, మైనార్టీ, ఓబీసీ ధృవీకరణ పత్రాలు వంటి సేవలు ఇంటి వద్దే పొందవచ్చు. ఇక కొత్త ఆధార్ నమోదు, జనాభా వివరాల్లో మార్పులు, ఆధార్‌లో పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్ అప్డేట్ వంటి సేవలు పొందవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఈసీ, సొసైటీ రిజిస్ట్రేషన్, పునరుద్దరణ, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ వంటి సేవలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక పోలీస్ శాఖకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా ఇంటి వద్ద నుంచే పొందవచ్చు.
ఈ సేవల వల్ల ప్రభుత్వ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. వృద్దులు, వికలాంగులు వంటివారు మీ సేవ కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉండదు. ఈ సర్వీసును పొందాలనుకుంటే ముందుగా 1100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి. అనంతరం తమకు కావాల్సిన సర్వీసును ఎంచుకోవాలి. ఆ తర్వాత సమయాన్ని ఎంచుకుంటే స్లాట్ బుక్ అవుతుంది. ఇక మీ సేవ వెబ్ సైట్ ద్వారా కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఏజెంట్ రాకముందే మీరు అవసరమైన పత్రాలను సిద్దంగా ఉంచుకోవాలి. ఈ సేవలను సమర్దవంతంగా అమలు చేసేందుకు ప్రస్తుతం 70 మందికిపైగా ఏజెంట్లు, వీఎల్ఈలకు ట్రైనింగ్ కల్పించారు. ఈ సేవల కోసం ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. అలాగే సమయం కూడా ఆదా అవుతుంది. మీ సేవా కేంద్రాలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
