Telangana local body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అనిశ్చితికి త్వరలో తెరపడేలా కనిపిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైనే తుది నిర్ణయం వెలువడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

హైకోర్టు ఇప్పటికే ఈ నెల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలను పరిశీలిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు కారణంగా ఈ ఎన్నికలు వరుసగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ల అంశం త్వరగా పరిష్కారం అయ్యేలా కనిపించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినా పరిస్థితులు అనుకూలంగా మారలేదు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో వచ్చిన ఉత్సాహం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోల్లాసం నింపింది. ఈ విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో వేల కోట్లు విలువైన కేంద్ర నిధులు వాడుకోలేని పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. అందుకే ఎన్నికల ద్వారా పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే కాకుండా, పార్టీ బలపరిచే అవకాశం కూడా కనిపిస్తున్నదని సర్కిల్‌లు భావిస్తున్నాయి.
సెప్టెంబర్ 29న బీసీ రిజర్వేషన్లను 42 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు హైకోర్టు, రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ–9పై స్టే విధించడంతో పరిస్థితి మారిపోయింది. హైకోర్టు తీర్పులకు అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ను అదే రోజున సస్పెండ్ చేసింది. ఇప్పుడు కేబినెట్ నిర్ణయం అనంతరం కొత్త షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అయినప్పటికీ, పరిపాలనా ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రేపటి కేబినెట్ నిర్ణయమే స్థానిక ఎన్నికల ప్రక్రియకు ‘ఫైనల్ కీ’ కానుంది.
ఈ నెల 17న జరిగే కేబినెట్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణే ప్రధాన అజెండాగా ఉండనుందని, బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు, ప్రత్యామ్నాయ మార్గాలు, కోర్టుల సూచనలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో జరిగే ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమాల తరువాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలా? లేక ముందే షెడ్యూల్ ప్రకటించాలా? అనే విషయంపై కూడా కేబినెట్‌లోపే తుది నిర్ణయం వెలువడనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




