Inter Student: రాలిపోయిన మరో విద్యా కుసుమం.. హన్మకొండలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

|

Mar 16, 2023 | 7:06 PM

కాలేజీల్లో చావుకేకలు మోగుతున్నాయి. మార్కుల మూర్ఖ దండనకు విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారు. ఉజ్వల భవిష్యత్‌కు బాటలేస్తాయనుకుంటే కాలేజీలే కబళిస్తున్నాయి

Inter Student: రాలిపోయిన మరో విద్యా కుసుమం.. హన్మకొండలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య
Death
Follow us on

కాలేజీల్లో చావుకేకలు మోగుతున్నాయి. మార్కుల మూర్ఖ దండనకు విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారు. ఉజ్వల భవిష్యత్‌కు బాటలేస్తాయనుకుంటే కాలేజీలే కబళిస్తున్నాయి. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు నింపుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ నార్సింగిలో సాత్విక్‌ ఆత్మహత్య ఘటన మరవకముందే.. హన్మకొండలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్‌ నాగ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే నాగజ్యోతిని బలితీసుకుందని విద్యార్ధి, ప్రజా సంఘాల ఆందోళన చేపట్టాయి. కూతురు ఇక లేదని రాదని తెలిసి కన్నవాళ్ల గుండె కన్నీరవుతుంటే.. మరోవైపు కాలేజీ యాజమాన్యం మాత్రం దున్నపోతుపై వానపడినట్టుగా వ్యవహరిస్తుందని ఆందోళనకారులు కన్నెర్ర చేశారు. నాగజ్యోతిది సొంతూరు జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల. బుధవారం ఇంటర్‌ ఫస్ట ఇయర్‌ ఎగ్జామ్‌ రాసిన నాగజ్యోతి.. సాయంత్రం పేరెంట్స్‌కు ఫోన్‌ చేసి మాట్లాడింది. బాగానే రాశానని.. బాగా చదువుకుంటున్నానని చెప్పింది. కానీ తెల్లారేసరికి దారుణం చోటు చేసుకుంది. నాగజ్యోతికి సీరియస్‌గా వుందని కాలేజీ నుంచి ఫోన్‌ రావడంతో పేరెంట్స్‌ ఉన్నఫళంగా ఏడునూతుల నుంచి హన్మకొండకు చేరుకున్నారు. అక్కడికి వచ్చాక చావు కబురు చల్లగా చెప్పేశారు కాలేజీ యాజమాన్యం.

కాగా నాగజ్యోతి మరణానికి ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయాలని .. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నాగజ్యోతి ఆత్మహత్య వారి కుటుంబ సభ్యుల్లో అంతులేని విషాదాన్ని నింపింది. నాగజ్యోతి మరణానికి కారణాలేంటి? ఒత్తిళ్లే కారణమా? వేధింపులా? విచారణలో తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..  క్లిక్ చేయండి..