AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: భాగ్యనగర వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..

కూకట్‌పల్లి నుంచి.. అటు ఉప్పల్‌ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో రెండు గంటల్లోనే ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఏ రేంజ్‌లో దంచికొట్టిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో రెండు గంటలపాటు కురిసిన వర్షంతో ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. అడుగు తీసి అడుగువేయాలంటే హడలిపోయారు జనం.

Hyderabad Rains: భాగ్యనగర వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
Hyderabad Rains
Noor Mohammed Shaik
| Edited By: Surya Kala|

Updated on: Jul 25, 2023 | 6:35 AM

Share

హైదరాబాద్‌ను భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు. భారీ వర్షం.. అందులోనూ సాయంత్రం వేళ కావడంతో.. వాహనదారులు నరకయాతన అనుభవించారు. హైదరాబాద్‌ నిన్న సాయంత్రం ఒక్కసారిగా సముద్రంలా మారింది. హఠాత్తుగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం చివురుటాకులా వణికిపోయింది. ఓవైపు ఎల్లో అలర్ట్‌ కొనసాగుతుండగా.. నగరం నలుమూలలా రెండు గంటలపాటు కుంభవృష్టి కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. భాగ్యనగర వీధులు మహాసంద్రాన్ని తలపించాయి. రోడ్లు జలాశయాల్లా మారాయి. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

ఇటు కూకట్‌పల్లి నుంచి.. అటు ఉప్పల్‌ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో రెండు గంటల్లోనే ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఏ రేంజ్‌లో దంచికొట్టిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో రెండు గంటలపాటు కురిసిన వర్షంతో ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. అడుగు తీసి అడుగువేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్‌ హోల్‌ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. అందులోనూ.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీ వర్షంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా.. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. హైటెక్‌సిటీ నుంచి జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్లే వాహనదారుల పరిస్థితి వర్ణనాతీమని చెప్పొచ్చు. దీంతో అలెర్ట్‌ అయిన ట్రాఫిక్‌ పోలీసులు.. కొన్ని ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు.

భారీ వర్షంతో హైదరాబాద్‌ యాకత్‌పురాలో ఓ పాతభవనం కూలిపోయింది. లంగర్‌హౌజ్‌లో పిడుగుపాటుతో 400 ఏళ్ల కుతుబ్‌షాహీ మసీద్‌కు చెందిన ఓ గోపురం కూలిపోగా.. మిగతా ప్రాంతంలో పగుళ్లు వచ్చాయి. నాంపల్లి యుసుఫిన్‌ దర్గాలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. అత్తాపూర్‌లో పిడుగుపాటుతో ఓ వ్యక్తి అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. మూసీకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. అటు.. మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో మూసీ వరద రోడ్లపైకి ప్రవహిస్తోంది. ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. మొత్తంగా.. నగరవాసులు ఉదయం కాస్త ఉపశమనం పొందామనుకునే లోపే.. సాయంత్రానికి భారీ వర్షం ఒక్కసారిగా దంచికొట్టింది. ఫలితంగా.. రెండు గంటల్లోనే హైదరాబాద్‌ సముద్రాన్ని తలపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..