AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: అయ్యో.. జాహ్నవి తండ్రి హఠాన్మరణం.. పరిహారం గురించి తెలియక ముందే..

అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పరిహారం ప్రకటించే రెండు రోజుల ముందే… ఆమె తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు. న్యాయం కోసం పోరాడిన వ్యక్తి… ఆ ఫలితం చూడకుండానే వెళ్లిపోవడం జాహ్నవి కుటుంబాన్ని మరోసారి విషాదంలోకి నెట్టింది. ..

Kurnool: అయ్యో.. జాహ్నవి తండ్రి హఠాన్మరణం.. పరిహారం గురించి తెలియక ముందే..
Jahnavi Kandula
Ram Naramaneni
|

Updated on: Feb 13, 2026 | 1:54 PM

Share

అమెరికాలో జరిగిన ఓ ప్రమాదం.. ఓ కుటుంబాన్ని రెండుసార్లు చిదిమేసింది. సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన తెలుగమ్మాయి జాహ్నవి కందుల కేసులో.. న్యాయం కోసం పోరాడిన ఆమె తండ్రి కందుల శ్రీకాంత్ ఇప్పుడు లేరు. జాహ్నవి మరణం తర్వాత శ్రీకాంత్ గుండెల్లో మిగిలినది ఒక్కటే.. న్యాయం. కానీ ఆ న్యాయం దక్కే క్షణానికి… ఆయనే ప్రాణాలు కోల్పోయారు. జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేందుకు సియాటెల్ టౌన్ సిద్ధమైంది. భారత రూపాయల్లో ఇది సుమారు రూ.262 కోట్లకు పైగా. అయితే ఈ పరిహారం ప్రకటన వెలువడే రెండు రోజుల ముందే.. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు.

శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హెడ్ కానిస్టేబుల్. జాహ్నవి మరణం తర్వాత ఆయన మానసికంగా పూర్తిగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ బాధతోనే చాలా రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ రావడంతో విధుల్లో చేరేందుకు వెళ్లారు. అక్కడే అసలు విషాదం జరిగింది. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తుండగా శ్రీకాంత్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. పరిహారం వస్తోంది అనే విషయం కూడా తెలియకుండానే ఆయన వెళ్లిపోయారని జాహ్నవి మామయ్య శ్రీధర్ తెలిపారు. జాహ్నవికి న్యాయం కోసం చివరి వరకు నిలబడ్డ వ్యక్తి.. ఆ ఫలితం చూడకుండానే చనిపోవడం తట్టుకోలేని బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు.

జాహ్నవి 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. 2023 జనవరి 23 రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కేసులో కీలకంగా బయటపడింది.. పోలీసు అధికారి కెవిన్ డేవ్ ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడం. 40 కిలోమీటర్ల పరిమితి ఉన్న చోట.. 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో తేలింది.

అంతేకాదు.. ప్రమాదం తర్వాత జాహ్నవి మరణాన్ని తక్కువ చేసి మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ మాట్లాడిన మాటలు కూడా బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. జాహ్నవి కుటుంబానికి పరిహారం చెల్లించాలనే నిర్ణయాన్ని సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటించారు. కాగా జాహ్నవి మరణంతో మొదలైన ఆ కుటుంబ విషాదం.. ఇప్పుడు ఆమె తండ్రి మరణంతో మరోసారి చీకట్లోకి వెళ్లింది.