Telangana: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి హరీష్..

|

Dec 01, 2022 | 6:25 PM

ఏ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తే.. ఆ రాష్ట్రంలో ఈడీలు, ఐటీలు దాడులు చేస్తాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

Telangana: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి హరీష్..
Minister Harish Rao
Follow us on

ఏ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తే.. ఆ రాష్ట్రంలో ఈడీలు, ఐటీలు దాడులు చేస్తాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ బ్లాక్‌ మెయిల్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మంత్రి. గురువారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ పెట్టిన పార్టీలు ఉంటాయి.. వాళ్లు విడిచిన బాణాలూ ఉంటాయన్నారు. అయితే, అవేవీ తెలంగాణలో పని చేయవని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్లలో నడుస్తాయేమో కానీ, తెలంగాణ గడ్డమీద నడవవని అన్నారు. బీజేపీ పాదయాత్రలన్నీ వెలవెలబోతున్నాయని, అందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల మాటలు ఎక్కువ.. వారి మీటింగ్‌లకు వచ్చే జనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా ప్రజల కోసం నిలబడతామన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ ముందు తలవంచే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గట్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు హరీష్.

ఇదే సమయంలో తెలంగాణ అప్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, రూ. 5లక్షల కోట్ల అప్పులు చేశారని బండి సంజయ్ విమర్శించగా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. కేంద్రం నెలకు లక్ష కోట్ల అప్పు తెస్తోందని దుయ్యబట్టారు. ఆ అప్పులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని విమర్శించారు. అప్పులు తెచ్చి వారి ఉద్దరిస్తున్నదేంటో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. బీజేపీ తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని విమర్శించారు మంత్రి.

ఇదిలాఉండగా.. ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాలలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..