Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Dam: కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?

శ్రీశైలం జలాశయానికి ముప్పు పొంచి ఉందా..? కళకళలాడే నీళ్ల కింద పూడిక మట్టి డేంజర్ బెల్స్ మోగిస్తోందా..? అవుననే అంటోంది హైడ్రో గ్రాఫిక్ సర్వే. వరద పొటెత్తినప్పుడల్లా డ్యామ్‌లోకి టన్నుల కొద్ది పూడిక మట్టి తన్నుకొస్తుందని చెబుతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అంటోంది. వరదకు అడ్డుకట్ట వేయకపోతే జలాశయానికి ప్రమాదం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Srisailam Dam: కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్..  ప్రమాదం తప్పదా?
Srisailam Dam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 20, 2025 | 9:05 PM

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మరోసారి హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణమైనా డ్యాంకు ప్రమాదం జరగవచ్చని తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీఫ్, తెలంగాణ డ్యామ్స్ సేఫ్టీ కమిటీ చైర్మన్ హోదాలో అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తక్షణం చర్యలు చేపట్టకపోతే ప్రమాదమే అని హెచ్చరించారు.

1960లో శ్రీశైలం దగ్గర కృష్ణా నదిపై రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభమై 1981లో పూర్తయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు అందిస్తున్న ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. సాగునీరు తాగు నీటితో పాటు విద్యుత్ వెలుగులు అందిస్తున్న ప్రాజెక్టు శ్రీశైలం. ప్రస్తుతం 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో, 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై మహా నగరానికి తాగునీటిని అందిస్తోంది.

ఇంత పెద్ద ప్రాజెక్టుకు గేట్ల దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. దీనిని ఇరిగేషన్ భాషలో ప్లంజ్ పూల్ అంటారు. 45 మీటర్ల లోతు 270 మీటర్ల వెడల్పు 400 అడుగుల పొడవున ఈ భారీ గొయ్యి విస్తరించింది. 1996లో భారీ వరదల కారణంగా ఈ గొయ్యి ఏర్పడింది. 2009లో రికార్డు స్థాయిలో వచ్చిన వరదలతో గొయ్యి పూర్తిస్థాయిలో విస్తరించింది. 25 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అవ్వడం అప్పట్లో సంచలనం అయింది.

అయితే ప్రాజెక్ట్ డిజైన్‌కు మించి వరద రావడంతో నిపుణులు ఆందోళన చెందారు. అనుకున్నట్లుగానే గొయ్యి భారీ స్థాయిలో విస్తరించింది. పునాదుల వరకు విస్తరిస్తే డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీడబ్ల్యుసీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నివేదికలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఊసనోగ్రఫీ నివేదిక ఆధారంగా తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ తాజాగా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. గొయ్యి పెద్దదిగా విస్తరించిందని ఏ క్షణమైనా డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన హెచ్చరించారు. తక్షణమే గొయ్యిని కాంక్రీట్ తో పూడ్చివేయాలని సూచించారు.

అనిల్ కుమార్ హెచ్చరికలతో పాటు గతంలో అనేక హెచ్చరికల కారణంగా తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు స్వయంగా పరిశీలించి చూసి వెళ్లారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డ్యామ్ భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…