AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓర్నీ అసలు కథ ఇదా.. రోడ్డు పక్కన వందలాది నాటుకోళ్ల స్టోరీ తెలిస్తే అవాక్కవడం పక్కా..

ఎల్కతుర్తిలో వేల సంఖ్యలో నాటుకోళ్లను వదిలేసి వెళ్లిన మిస్టరీ వీడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి, అసలు నిజాన్ని బయటపెట్టారు. ఒక రైతు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసమే కోళ్లను వదిలేశాడని తేలింది. స్థానికులు మాత్రం అనుకోని విందుతో పండగ చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..?

Telangana: ఓర్నీ అసలు కథ ఇదా.. రోడ్డు పక్కన వందలాది నాటుకోళ్ల స్టోరీ తెలిస్తే అవాక్కవడం పక్కా..
Elkaturthi Chicken Mystery Solved
Krishna S
|

Updated on: Nov 13, 2025 | 12:13 PM

Share

తెలంగాణ హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి నాటుకోళ్ల మిస్టరీ వీడింది. ఎల్కతుర్తిలో జాతీయ రహదారి పక్కన రెండు వేలకు పైగా నాటుకోళ్లను వదిలేసి వెళ్లిన ఘటన గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మిస్టరీకి ఎట్టకేలకు పోలీసులు తెరదించారు. ఊరు ఊరంతా పత్తి చేలలో కోళ్లను పట్టుకొని పులుసు చేసుకుని విందు చేసుకునేలా చేసిన ఈ వింత సంఘటన… చివరకు ఓ రైతు ఇన్సూరెన్స్ కోసం ఆడిన నాటకమని పోలీసులు తేల్చారు.

ఈ నెల 8న ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లో ఒక్కసారిగా వేల సంఖ్యలో నాటుకోళ్లు ప్రత్యక్షమయ్యాయి. అకస్మాత్తుగా వాటిని వదిలివెళ్లడంతో అవి పత్తి చేలలోకి చేరాయి. ఈ విషయం తెలియగానే ఎల్కతుర్తి వాసులు పెద్ద ఎత్తున పొలాల వద్దకు చేరుకున్నారు. దొరికిన కాడికి కోళ్లను పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. కేవలం గంట వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా కోళ్ల అరుపులతో దద్దరిల్లింది. పట్టుకున్న కోళ్లతో కొంతమంది వెంటనే నాటుకోడి పులుసు చేసుకుని ఆనందంగా విందు చేసుకున్నారు. ఈ దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

వ్యాధి వదంతులు.. వైద్య పరీక్షలు

కోళ్లు వదిలివెళ్లడం వెనుక ఏదైనా వ్యాధి ఉందేమో అనే వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ వదంతులను ఎల్కతుర్తి పశువైద్యాధికారి ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, శాంపిల్స్‌ను వరంగల్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా అవి ఆరోగ్యంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.

మిగిలిన కోళ్లతో ఇన్సూరెన్స్ డ్రామా

కోళ్లు వదిలివెళ్లిన మిస్టరీని ఛేదించేందుకు విచారణ చేపట్టిన పోలీసులు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వరదల కారణంగా ఒక రైతుకు చెందిన రెడ్డిపురం ఫామ్‌లోని కోళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఫామ్‌లో కొద్ది సంఖ్యలో కోళ్లు మిగిలిపోయాయి. వీటిని కూడా వరదల్లో కొట్టుకుపోయినట్లుగా చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసమే ఆ రైతు మిగిలిన కోళ్లను పొలాల్లో వదిలేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో నాటుకోళ్ల మాయం వెనుక ఉన్న అసలు కారణం ఇన్సూరెన్స్ మోసమని స్పష్టమైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా కలకలం రేగగా, స్థానిక ప్రజలకు మాత్రం అనుకోని నాటుకోడి విందు దొరికింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..